ఫలించిన సీఎం జగన్‌ సాయం

CM YS Jagan Help Cancer Patient - Sakshi

కోలుకుంటున్న నీరజ్‌కుమార్‌

సాక్షి, విశాఖపట్నం: ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. జబ్బు నయం కావాలంటే లక్ష, రెండు లక్షలు కాదు.. సుమారు 25 లక్షల రూపాయలు అవసరమవుతాయని వైద్యులు చెప్పడంతో, రోజు వారీ కూలి డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే తమకు అంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం సాధ్యం కాదని బెంగ పెట్టుకున్నారు. ఏడాది నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. వీరి కుటుంబ పరిస్థితి తెలిసిన కొడుకు స్నేహితులు తమ మిత్రుడిని కాపాడుకోవాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఈనెల 4న విశాఖ శారదాపీఠం సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం విమానాశ్రయం వద్ద ‘సేవ్‌ అవర్‌ ఫ్రెండ్‌’ బ్యానర్‌తో నిల్చున్నారు. కారులోంచి బ్యానర్‌ చూసిన ముఖ్యమంత్రి  కాన్వాయ్‌ని నిలిపి వారితో మాట్లాడారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విశాఖ జ్ఞానాపురానికి చెందిన తమ స్నేహితుడు నీరజ్‌కుమార్‌ వైద్యానికయ్యే ఖర్చు గురించి వారు సీఎంకు వివరించారు.

పూర్తి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నీరజ్‌కుమార్‌ వైద్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, దిగులు చెందవద్దని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు నీరజ్‌కుమార్‌కు వైద్యం శరవేగంగా అందుతోంది. ఇప్పటికే వైద్యం కోసం రూ.10 లక్షలు ప్రభుత్వం నుంచి చెల్లించారు. ఇంకా ఎంత అవసరమైతే అంత సొమ్ము ప్రభుత్వమే సమకూరుస్తుందని కుటుంబ సభ్యులకు, ఆస్పత్రి వర్గాలకు సీఎంవో అధికారులు స్పష్టం చేశారు. నీరజ్‌కుమార్‌ ఆరోగ్య పరిస్థితిని, వైద్యం అందుతున్న తీరును ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.

కాగా నీరజ్‌కుమార్‌ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం కీమోథెరపీ చేస్తున్నారు. గుండెకు రక్తప్రసరణలో తలెత్తిన సమస్యను కూడా సరిచేశారు. ఇప్పుడు ఆక్సిజన్‌ అవసరం లేకుండా వైద్యం అందిస్తున్నారు. గతంలో మాదిరిగా గొట్టం ద్వారా కాకుండా ఇప్పుడు నేరుగా నోటి నుంచి ఆహారం ఇస్తున్నారని నీరజ్‌కుమార్‌ తండ్రి అప్పలనాయుడు ‘సాక్షి’తో చెప్పారు. తమ కుమారుడు ఏమవుతాడోనని కొన్నాళ్లుగా ఆందోళనతో ఉన్న తమను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దేవుడిలా ఆదుకుంటున్నారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. (చదవండి: పరిమళించిన మానవత్వం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top