ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యం చెప్పిన సీఎం జగన్‌

CM YS Jagan Console Undavalli Sridevi Over TDP Leaders Comments - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్‌సీపీ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహం వద్ద శ్రీదేవికి జరిగిన అవమానాన్ని సుచరిత ముఖ్యమంత్రికి వివరించారు. అదే విధంగా టీడీపీ నేతల అరాచకాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అవమానభారంతో ఆవేదన చెందుతున్న శ్రీదేవికి సీఎం జగన్‌ ధైర్యం చెప్పారు. ఇక హోం మంత్రి సుచరితతో పాటు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా సీఎం జగన్‌ను కలిశారు. దళిత మహిళా ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన కేసులో దోషులెవరూ తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తుంటే ఆ పార్టీ సీనియర్‌ నేతలు వర్ల రామయ్య లాంటి వాళ్ళు వాటిని ప్రోత్సహించటం సిగ్గుచేటు అని విమర్శించారు.

కాగా రాజధాని ప్రాంతంలో వినాయకుడిని దర్శించుకునేందుకు వెళ్లిన శ్రీదేవిని కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు దాడికి దిగిన విషయం విదితమే. సోమవారం వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా శ్రీదేవి తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్‌ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి పూజ చేస్తుండగా టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ.. దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపునకు దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో కులం పేరుతో ఆమెను దూషించారు.

ఈ క్రమంలో వారి దౌర్జన్యాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా అడ్డుకోబోయిన పోలీసులను సైతం టీడీపీ నాయకులు నెట్టిపడేశారు. దీంతో తనను దారుణమైన పదజాలంతో దూషించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి లోనై కంటతడి పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ వట్టికూటి గౌతమి కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుల్లో కొమ్మినేని శివయ్య, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని వారిని తుళ్లూరు డీఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు కొమ్మినేని రామకృష్ణ, బుజ్జి పరారీలో ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top