
సాక్షి, అమరావతి: కళ్లకు క్యాన్సర్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి హేమ (4) ఉదంతంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాలను చూసిన ఆయన వెంటనే హేమకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి కుటుంబంతో మాట్లాడి వైద్యం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన చిన్నారి హేమ వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం తెలిపారు.
ఇలాంటి నిరుపేదలను పూర్తి స్థాయిలో ఆదుకోవడానికే ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు తెరతీశామని పేర్కొన్నారు. గతంలోలా కాకుండా క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని విడతలైనా చికిత్స అందించాలన్నారు. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈలోగా అత్యవసర కేసులు ఉంటే క్యాన్సర్ రోగులకు వెంటనే చికిత్సలు అందించాలని సూచించారు.