
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీమహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం సాయంత్రం 6.05 గంటలకు సంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రికి దుర్గగుడి ఈవో ఎం.వీ.సురేష్, ప్రధాన అర్చకులు ఎల్.డీ ప్రసాద్, స్థానాచార్య వి.శివప్రసాద్‌శర్మ తదితరులు పూర్ణకుంభంతో, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
పట్టుచీర తదితరాలతో కూడిన వెండి పళ్లెంను ముఖ్యమంత్రి జగన్ తన శిరస్సుపై ఉంచుకుని దుర్గమ్మ సన్నిధికి చేరుకుని వాటిని అమ్మవారికి సమర్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ సీఎం పేరిట అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఈవో శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందచేశారు. సీఎం వెంట దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేలు తదితరులున్నారు. అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకునే సమయంలో సాధారణ, రూ.100 టికెట్ క్యూలైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారు..
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఐశ్వర్యప్రాప్తి, విజయాన్ని అందించే శ్రీమహాలక్షి్మని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.