ఇసుక వారోత్సవాలకు సీఎం జగన్‌ నిర్ణయం

CM Jagan Review Meeting On Sand Issue In Andhra Pradesh - Sakshi

సాక్షి, తాడేపల్లి : స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా  ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక వారోత్సవాలను నిర్వహిద్దామని ఆయన నిర్ణయించారు. వారం రోజులపాటు ఇసుక మీదే పనిచేసి.. ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 

‘పళ్లు ఇచ్చే చెట్టుపైనే రాళ్లు వేస్తున్నారు. గతంలో వ్యవస్థ తీవ్ర అవినీతి మయం అయింది. దీన్ని పూర్తిగా రిపేర్‌ చేస్తున్నాం. ఎక్కడైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించాం. ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగామని గర్వంగా చెప్పగలం. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు వస్తున్నాయి. వర్షాలు కురవడం రైతులకు మంచిదే. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదే. కానీ, రాబందుల మాదిరిగా మనపై రాళ్లు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోంది. వరదల వల్ల ఇసుక ఆశించిన స్థాయిలో తీయలేకపోతున్నాం. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నాం. ఇసుక వారోత్సవం అని కార్యక్రమం పెడతాం. వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దాం. ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దాం. వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగవుతాయి’ అని సీఎం అన్నారు.

70 చోట్ల ఇసుక రీచ్‌లు గుర్తింపు..
‘ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి తర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహారా ఉండాలి. డీజీపీ స్వయంగా దీనిని పర్యవేక్షించాలి. ఎంత బాగా పనిచేసినా మనపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అందుకే మనం వెంటనే స్పందించాల్సిన అవరసరం ఉంది. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు పని దొరకడం లేదన్నది సరికాదు. గతంలో అవినీతి , మాఫియాతో ఇసుకను తరలించేవారు. ఇప్పుడు ప్రభుత్వం అధీనంలోనే ఇసుక రవాణా జరుగుతుంది. మరింతగా కార్మికులకు పనులు లభిస్తాయి. పట్టాభూములున్న రీచ్‌ల్లో తప్ప మిగతా చోట్ల మాన్యవల్‌గా ఇసుక తీయాలని చెప్పాం. వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో 70 చోట్ల రీచ్‌లను గుర్తించారు’అని సీఎం చెప్పారు.

20 కి.మీ. వరకు ట్రాక్టర్ల ద్వారా రవాణా
 ‘గ్రామ సచివాలయాల్లో ఎవరైనా చలానా కట్టి 20 కి.మీ వరకు ట్రాక్టర్‌ ద్వారా ఇసుక తరలించవచ్చు. పనులు కావాల్సిన కార్మికులు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక రీచ్‌ల్లో పనులు చేసుకోవచ్చు. వరదలు తగ్గగానే రీచ్‌ల్లో ఎవరు పనులు అడిగినా ఇవ్వాలి. ప్రభుత్వం అధినంలోనే ఇసుక రవాణా జరుగుతుంది కాబట్టి.. పేదలకు మరింత మంచే జరుగుతుంది. ప్రతిపక్షం కావాలనే దుష్ప్రచారం చేస్తోంది. కౌలు రైతులకు సాయం చేశాం.. వారికి మరిన్ని పనులు కల్పించే అవకాశం ఉంటుంది. వరదల కారణంగా 267 రీచ్‌లకు 69 చోట్ల మాత్రమే ఇసుక తీస్తున్నారు. నవంబర్‌ వరకు వరదలు తగ్గుతాయి. ఇసుక అందుబాటులోకి వస్తుంది’అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top