1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం : సీఎం జగన్‌

CM Jagan Decides To Implement Reforms In Education Department - Sakshi

విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు

సాక్షి, అమరావతి : విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ తమ సిఫార్సులను సీఎం జగన్‌కు వివరించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై కమిటీ సిఫార్సులపై చర్చించారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సిఫార్సుల్లో కూడా కమిటీ భాగస్వామ్యం కావాలని అన్నారు. రూ.5 కోట్ల ఖర్చుతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

‘వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలి. టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. 45 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. స్కూళ్లలో ప్రారంభించిన నాడు –నేడు కార్యక్రమం కొనసాగాలి.  పిల్లలకోసం ఏర్పాటు చేసే ఫర్నీచర్‌ క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దు. పాఠ్యప్రణాళిక చాలా బలోపేతంగా ఉండాలి’అని సీఎం అన్నారు.

ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలి..
‘ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఉన్న నాణ్యత, ప్రమాణాలను కూడా పరిశీలించాలి. ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో క్వాలిటీని పరిశీలించాలి, పర్యవేక్షించాలి. అగ్రికల్చర్‌ కాలేజీకి 100 ఎకరాలు ఉంటేనే అనుమతి ఇవ్వాలి. దీనిపై రెగ్యులేటరీ కమిటీ నియంత్రణ ఉండాలి. చదువు అనేది కచ్చితంగా ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలి. ప్రైవేటు వర్సిటీల్లో క్వాలిటీ లేనప్పుడు సర్టిఫికెట్లకు ఏం వాల్యూ ఉంటుంది. విద్యా అనేది వ్యాపారం, డబ్బు కోసం కాదు. ఇది ఒక ఛారిటీ. ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఖాలీలను భర్తీ చేయాలి. విద్యాశాఖలోని అధికారులు వారధిలా పనిచేయాలి’అని సీఎం వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా విజయవాడలోని ప్రైవేటు కాలేజీల్లో చేపట్టిన తనిఖీల అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఐపీఎల్‌ అంటూ ఐఐటీ పరీక్షల కోసం ప్రీమియర్‌ లీగ్‌లు పెడుతున్నారని తెలిపారు. ఫీజుల విషయాన్ని కూడా సీఎం దృష్టికి అధికారులు తెచ్చారు. రూ.40వేల నుంచి లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. కాని ప్రభుత్వానికి మాత్రం రూ.2వేలు మాత్రమే వసూలు చేస్తున్నట్టుగా చూపిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి కాలేజీలపై కఠినంగా వ్యవరించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top