
సాక్షి, అమరావతి: నంది అవార్డుల ప్రకటనతో పరువు పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇంత రచ్చ అవుతుందని తాను అనుకోలేదని, ఇంత రాద్ధాంతం జరుగుతుందనుకుంటే ఇలా చేసే వాడిని కాదని అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత జరిగిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నంది అవార్డుల ప్రకటన తీవ్ర వివాదాస్పదంగా మారి అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. టీడీపీ నేతల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అవార్డులు ప్రకటించి తప్పు చేశామని చంద్రబాబు చెప్పారు. ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించి ఉంటే ఐవీఆర్‌ఎస్ సర్వే చేయించి అభిప్రాయాలు సేకరించేవారమని తెలిపారు. జ్యూరీ ఎంపిక చేసిన వారికే అవార్డులు ఇచ్చామన్నారు.
ఏపీలో ఆధార్‌లేని వాళ్లు మాట్లాడతారా?: లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డులపై మాట్లాడుతున్నారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తన తండ్రి, సీఎం చంద్రబాబు చాలా బాధపడ్డారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటించారు.