కులాల స్థాయిని మార్చే అధికారం కేంద్రానిదే | CM Chandrababu comments with different cast communities | Sakshi
Sakshi News home page

కులాల స్థాయిని మార్చే అధికారం కేంద్రానిదే

Aug 28 2017 1:17 AM | Updated on Aug 20 2018 9:18 PM

కులాల స్థాయిని మార్చే అధికారం కేంద్రానిదే - Sakshi

కులాల స్థాయిని మార్చే అధికారం కేంద్రానిదే

ఒక కులం స్థాయిని మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

కాకినాడలో వివిధ కులాల సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం
 
సాక్షి, కాకినాడ: ఒక కులం స్థాయిని మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలిచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి, వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ సంఘాలతో జరిగిన సమావేశంలో రజక ఫెడరేషన్‌ చైర్మన్‌తో సీఎం చంద్రబాబు వేదికపై మాట్లాడించారు.

రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశం పెట్టారని ఆ నేత గుర్తు చేశారు. మూడేళ్లయినా దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో తమ సంఘం నాయకులు కనపడిన చోటల్లా తమను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఒక కులానికి చెందిన ప్రజలను.. మరో కేటగిరీలోని కులాల జాబితాలోకి చేర్చే అధికారం కేంద్రం చేతిలో ఉందని చెప్పారు. ఇటీవల కాపు నేతలు తనను కలసి తమకు రాజకీయ రిజర్వేషన్లు వద్దని.. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కావాలని కోరారన్నారు.

బీసీలకు ఎలాంటి నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ సీఎం చెప్పుకొచ్చారు. కాకినాడ ఎన్నికల తర్వాత అమరావతిలో కులాల వారీగా సమావేశం నిర్వహించి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలిస్తామని సీఎం హామీలు గుప్పించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు పెట్టుబడి నిధి కింద ఇప్పటికి రూ.6 వేలు ఇచ్చామని, రేపో మాపో మిగతా రూ.4 వేలిస్తామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement