పోలీసులా.. చింతమనేని ఏజెంట్లా?

Civil rights group Srimannarayana Slams Police Department - Sakshi

పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీమన్నారాయణ నిలదీత

పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్‌): లా అండ్‌ ఆర్డర్‌ అమలులో తప్పు చేసిన చింతమనేని ప్రభాకర్‌ను వదిలేసి వెలుగులోకి తీసుకు వచ్చిన కత్తుల రవికుమార్‌జైన్‌ను అరెస్ట్‌ చేయడం ఏమిటని? పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ ఓ ప్రకటనలో ప్రశ్నించారు.  ఇది పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేయటమే అన్నారు. పోలీసులు కత్తుల రవిపై పెట్టిన కేసును తక్షణం ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు.  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులను, వెనుకబడిన వర్గాల వారిని దూషించడం, అవమానించడం,  కొట్టడం పరిపాటిగా మారిపోతోందని పేర్కొన్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం మానేసి బాధితులపైన, వెలుగులోకి తీసుకు వచ్చిన వారిపైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయటం అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేకం అని వివరించారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయటమేనని, చట్టం తనపని తాను చేసుకు పోతుంది అంటే అధికారానికి దాసోహామనటమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడ లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దళితుల ఆర్థిక వెనుకబాటు తనం, నిస్సహాయతలను ఆసరా చేసుకుని ప్రభుత్వ విప్‌గా ఉన్న వ్యక్తి దళితులను చులకనగా, అవమానకరంగా మాట్లాడటం, ప్రవర్తించటం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కటమేనన్నారు. ఎమ్మెల్యే చింతమనేనిని అన్ని విధాలుగా కాపాడుతున్న ప్రభుత్వాధినేత చంద్రబాబు కూడా దోషే అవుతారన్నారు. తక్షణం చింతమనేనిని అరెస్టు చేయాలని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, న్యాయవాదులు, మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దళితులను అవమానించే ఇలాంటి వారందరికీ తగిన గుణపాఠం ప్రజలు చెబుతారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top