అమరావతిలో పరిటాల బంధువుల పాగా

CID Investigation On Paritala Family Land Acquisitions In Capital - Sakshi

రాజధాని ప్రాంతంలో భూ కొనుగోళ్లపై సీఐడీ విచారణ 

భూకొనుగోలుదారుల్లో ఇద్దరు తెల్లరేషన్‌కార్డు దారులు 

కనగానపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆరా 

‘పరిటాల’ బినామీలుగా భావిస్తున్న అధికారులు 

సాక్షి, కనగానపల్లి: రాజధాని ప్రాంతంగా గుర్తించిన అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోని భూముల కొనుగోలుపై సీఐడీ కన్నేసింది. రూ.కోట్ల విలువైన భూములను తెల్లరేషన్‌కార్డు కలిగిన వారు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్న అధికారులు తీగ లాగుతున్నారు. కనగానపల్లికి చెందిన నిర్మలాదేవి, బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాంచౌదరిలు అమరావతి పరిధిలోని తాడికొండ వద్ద ఒక్కొక్కరు అర ఎకరం చొప్పున భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న వీరు రాజధాని ప్రాంతంలో భూములు కొనే పరిస్థితి లేదని, ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధికి బినామీలుగా వీరు ఉన్నట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు.   చదవండి: పరిటాల కుటుంబ దోపిడీకి అడ్డుకట్ట..

ఇద్దరూ తెల్లరేషన్‌కార్డుదారులే... 
సీఐడీ సీఐ ఎస్‌ఎం గౌస్, ఎస్‌ఐ సుధాకర్‌ మంగళవారం కనగానపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి నిర్మలాదేవి, జయరాంచౌదరిల వివరాలను సేకరించారు. నిర్మలాదేవి(రేషన్‌ కార్డు నంబర్‌: డబ్ల్యూఏపీ1233001200252) స్థానికంగానే ఉండటంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. చిల్లర దుకాణం నడుపుకొంటూ జీవిస్తూ రూ.కోట్ల విలువ చేసే భూమి ఎలా కొన్నారు..? అని సీఐడీ అధికారులు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిర్మలాదేవి మాత్రం తమ సమీప బంధువులు, వ్యక్తుల సహకారంతో భూమి కొన్నట్లు చెప్పారు. వీరు మాజీ మంత్రి పరిటాల సునీతకు దూరపు బంధువులుగా తెలుస్తోంది. 

తాడిపత్రి తహసీల్దార్‌ కార్యాలయంలో విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు  

ఇక బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాం చౌదరి(రేషన్‌ కార్డు నంబర్‌: ఆర్‌ఏపీ123300300110) అమరాపురంలోని సొసైటీ బ్యాంకులో సీఈఓగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన్ను నేరుగా విచారించలేకపోయారు. అయితే ఆయన వ్యక్తిగత ఆదాయ వివరాలు, కుటుంబ వివరాలను తహసీల్దార్‌ కార్యాలయ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. జయరాంచౌదరి కూడా పరిటాల కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే భూమి కొనుగోలు చేశాడా? లేక అతని సమీప బంధువుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు బినామీగా భూములు కొన్నాడా? అనే దానిపై సీఐడీ అధికారులు విచారణ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా అమరావతి ప్రాంతంలోని భూముల కొనుగోలు వ్యవహారంలో బినామీల బాగోతం ఒక్కొక్కటిగా వెలికితీసేందుకు అధికారులు విచారణ వేగవంతం చేశారు. 

తాడిపత్రిలోనూ విచారణ... 
తాడిపత్రి రూరల్‌: సీఐడీ అధికారులు తాడిపత్రి విజయలక్ష్మి థియేటర్‌ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్యపాఠశాల నిర్వాహకుడు కె.చంద్రశేఖర్‌రెడ్డిని కూడా విచారించారు. 2014లో ఆయన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని ఘని ఆత్మకూరులో కొనుగోలు చేసిన 4 ఎకరాలపై ఆరా తీశారు. ముందుగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన సీఐడీ సీఐ ఎస్‌సీ గౌస్‌ తహసీల్దార్‌ నయాజ్‌అహ్మద్‌తో మాట్లాడారు. చంద్రశేఖర్‌రెడ్డి పేరున ఉన్న తెల్లరేషన్‌ కార్డుపై ఆరా తీశారు. అనంతరం ఈ నెల 20న కర్నూలులోని తమ కార్యాలయంలో విచారణ నిమిత్తం హాజరు కావాల్సిందిగా చంద్రశేఖర్‌రెడ్డికి నోటీస్‌ అందజేశారు.  

చదవండి: పరిటాల హత్య కేసులో సంచలన విషయాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top