సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను అణచివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
పాత కేసులో చెవిరెడ్డి మళ్లీ అరెస్టు పీలేరు జడ్జి ముందు హాజరు
మిథున్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ఒకరోజు కస్టడీకి అనుమతి
న్యాయవాదుల సమక్షంలో విచారించాలని శ్రీకాళహస్తి కోర్టు ఆదేశం
తిరుపతి : సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను అణచివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు చంద్రగిరి ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డిలపై ఎయిర్ ఇండియా మేనేజరుతో అక్రమ కేసు బనాయించింది. అంతటితో ఆగకుండా స్వయంగా లొంగిపోయేందుకు వస్తున్న ఎంపీని ఆరెస్టుచేసి హంగామా సృష్టించింది. కాల్‌మనీ లాంటి కేసుల్లో సైతం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన ప్రభుత్వం.. ప్రయాణికుల తరపున ప్రశ్నించిన ఎంపీ మిథున్‌రెడ్డిపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు పంపింది. ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకట్టవేస్తోంది. ఇందులో భాగంగా కస్టడీ పిటిషన్ వేసి కక్ష సాధింపునకు తెగబడింది.
పోలీస్ కస్టడీకి మిథున్‌రెడ్డి, మధుసూదన్ రెడ్డి
పోలీసులు శ్రీకాళహస్తి కోర్టులో వేసిన కస్టడీ పిటీషన్ గురువారం విచారణకు వచ్చింది. ఈ మేరకు మిథున్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డిలను విచారణకు కోర్టు అనుమతించింది.
చెవిరెడ్డి మళ్లీ అరెస్ట్
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పాతకేసుల్లో జైలుకు పంపేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. సమైకాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులో ఇప్పటికే అరెస్టయి నెల్లూరు జైలులో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ 2009 ఎన్నికల సమయంలో గోడలపై రాతలు రాయించిన దానికి సంబంధించి అప్పటో పీలేరు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసు ఇప్పుడు మళ్లీ తిరగదోడి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న చెవిరెడ్డిని పిటీ వారెంట్ కింద పీలేరు జడ్జి ముందు హాజరు పరిచారు.
వెల్లువెత్తుతున్న నిరసన
అక్రమ కేసులతో ప్రతిపక్షం గొంతునొక్కే యత్నాన్ని ప్రజలు గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. తమ నేతలను జైల్లో పెడితే ఊరుకునేది లేదని గళమెత్తుతున్నారు. జిల్లా అంతటా నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు.