అభివృద్ధిలో అ‘ద్వితీయం’

Cheerala Get Second Rank In Swatch Survekshan - Sakshi

ఎమ్మెల్యే ఆమంచి పాలనలో చీరాల అభివృద్ధి భళా..

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్‌లో చీరాల మున్సిపాలిటీకి రాష్ట్రంలోనే రెండో స్థానం

పార్టీలకు అతీతంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన ఆమంచి

సాక్షి, చీరాల (ప్రకాశం): జిల్లా పరిధిలోని చీరాల పేరు వినగానే ముందు గుర్తుకు వచ్చేది చేనేత రంగం. అలాగే వస్త్ర రంగంలో చినబొంబాయిగా పేరొందిన చీరాలలో ఎందరో ఉద్దండులు తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చరిత్రలో నిలిచారు. రాజకీయంగా చీరాల నియోజకవర్గం 1951 నుంచి ఏర్పడినప్పటికి అభివృద్ధికి దూరంగా ఉండేది. ముఖ్యంగా అగ్గిపెట్టలాంటి రోడ్లు, అధ్వాన పారిశుద్ధ్యం, అస్తవ్యస్త డ్రైనేజితో పాటు పేదలకు సొంత ఇల్లు నిర్మాణం కలగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్‌ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా పనిచేశారు.

రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆమంచిని అభివృద్ధిలో వేలెత్తి చూపని స్థాయికి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలను తెరపైకి తెస్తూ ఎన్నికల అనంతరం మాత్రం అందరినీ సమానంగానే చూస్తూ వారికి కావాల్సిన ప్రజా అవసరాలను తీర్చడం ఆమంచికి బాగా కలిసొచ్చిన అంశం. మున్సిపాలిటీలో అయితే వార్డులను, పంచాయతీ అయితే గ్రామాలకు నిధులు కేటాయించి సరికొత్త రాజకీయాలకు ఆమంచి తెరలేపారు.

వ్యాపారులకు అండగా..
చీరాలలో సుదీర్ఘకాల సమస్యగా ఉన్న నెహ్రూ కూరగాయల మార్కెట్‌ను సైతం వందరోజుల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన మార్కెట్‌ను అందుబాటులో తెచ్చారు. ఈపూరుపాలెం కూరగాయల మార్కెట్‌ను, వేటపాలెం కూరగాయల, చేపల మార్కెట్‌ను సుందరంగా ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులో తెచ్చారు. పట్టణంలోని ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా రోడ్లను విస్తరింపచేయడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్ట్రీట్‌ వెండర్స్‌ (తోపుడు బండ్లు) జోన్ల ఏర్పాటు చేశారు. దీంతో కొంత ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు, తోపుడుబండ్లు వ్యాపారులకు ఒక పరిష్కారం చూపించారు. ఇరుకుగా ఉండే చీరాల నుంచి వేటపాలెం ప్రధాన రహదారిని ఇరువైపులా విస్తరింపచేసి ప్రమాదాలు జరగకుండా డివైడర్లు ఏర్పాటు చేయడంతో పాటు అతి తక్కువ ఖర్చుతో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు.

పేదవాని కలకు సాకార దిశగా..
నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ఆమంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కూడా సుమారు 10 వేల ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. స్థలాల కేటాయింపుల్లో పేదరికమే ప్రాతిపదికన అర్హులైన వారికి పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా కేటాయించారు. వాటిలో ముఖ్యంగా కొణిజేటి చేనేతపురి, దత్తక్షేత్రం, అబ్దుల్‌ కలాం కాలనీ, వివేకానంద కాలనీల వంటి సముదాయాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

ప్రజల ఆకాంక్షకు బాసటగా..
తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి వాడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు ఉన్న తీర ప్రాంత గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టారు. తద్వారా మత్య్సకార గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చడంతో పాటు పర్యాటకంగా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు అడుగులు వేశారు. చీరాల ప్రాంతంలో అత్యధికంగా యువకులు ఆటోలు నమ్ముకుని జీవనాన్ని సాగిస్తుంటారు. వారందరికి ఆమంచి గతంలో వంద ఆటోలు ఇప్పించి ఆటోడ్రైవర్లను ఓనర్లుగా మార్చారు. చేనేతలకు సైతం చీరాల పుట్టినిల్లు కావడంతో చీరాలకు ఏడీ కార్యాలయం కావాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏడీ కార్యాలయాన్ని చీరాలకు మార్పించారు.

అలానే పట్టణంలోని నడిబొడ్డున ఉన్న అతివిలువైన స్థలాన్ని దళితులకు కలగా ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ భవన్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆమంచి దళితుల పక్షపాతి అని రుజువు చేసుకున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ముస్లింల కోసం సుమారు రూ.2కోట్లు వెచ్చించి షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేసి ముస్లింల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా మెరుగైన విద్యనందించేందుకు గాను కొత్తపేటలో 45రోజుల్లోనే అన్ని సౌకర్యాలతో జిల్లా పరిషత్‌ పాఠశాలను నిర్మించారు.ఆ పాఠశాలలో గడచిన విద్యాసంవత్సరంలో నో అడ్మిషన్‌ బోర్డు పెట్టారంటే ఆ పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు ఉన్న నమ్మకాన్ని చెప్పకనే చెప్పవచ్చు.

ఆమంచి చొరవతో గడచిన విద్యాసంవత్సరంలో 5 వేలకు పైచిలుకు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇందుకు ఆమంచి ఆయా ప్రభుత్వ పాఠశాలలపై వసతులను మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ విద్యావ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టారని చెప్పవచ్చు. నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం కేటాయించడం, ప్రతిని«త్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, చిన్నపాటి ప్రజాసమస్యను సైతం అధికారులతో మాట్లాడి వెంటనే ఆయా సమస్యలకు పరిష్కారం చూపుతారని ఆమంచిపై ప్రజల్లో మంచి నమ్మకం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు తలలో నాలుకగా మారడంతో పాటు ఆమంచిపై నియోజకవర్గంలో సానుకూల వాతావరణం ఉంది.

మౌలిక వసతులు..
చీరాల నియోజకవర్గం అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది జనాభా నివాసముండే ప్రాంతం. ముఖ్యంగా చీరాలలో వ్యాపారాల అవసరాలకు వచ్చేవారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. వీరందరికీ అనుగుణంగా చీరాల పట్టణాన్ని ఆమంచి అన్ని సౌకర్యాలతో ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దారు. మరిముఖ్యంగా నియోజకవర్గంలోని మురుగునీటి కాల్వలు, పారిశుద్ధ్య నిర్వహణ, మంచి సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చీరాల మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దేశం మొత్తంలోనే చీరాలకు 11వ స్థానంలో, రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. దీనికి తోడు సుదీర్ఘకాలంగా సమస్యగా ఉన్న సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను ముందు చూపుతో వేటపాలెం మండలంలోని రామాపురంలో అత్యంత వ్యవప్రయాసలతో ఏర్పాటు చేశారు.

చీరాల ప్రజలు కోరుకునేది ఇవే...
చేనేతలకు టెక్స్‌టైల్స్‌ పార్కు చేయాల్సి ఉంది. నియోజకవర్గంలోని ప్రధానంగా ఉన్న కొన్ని రోడ్లు విస్తరించాల్సి ఉంది. పట్టణంలోని మౌలిక వసతులపై ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలించి సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామాల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top