
'రాజధానిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు'
రాజధాని ఎంపిక విషయంపై ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు మాట్లాడొద్దని మంత్రులను చంద్రబాబు హెచ్చరించారు.
హైదరాబాద్: ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వాటన్నింటినీ ఒక ప్రత్యేక బడ్జెట్‌గా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఎంసెట్ పై సుప్రీంకోర్టు తీర్పును ఏపీ కేబినెట్ స్వాగతించింది.
ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు విశేష అధికారాల అప్పగింత అంశంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. గవర్నర్ అధికారాలపై విభజన చట్టంలో ఉన్న అంశాలను మంత్రులకు చంద్రబాబు వివరించారు. విభజనచట్టంలో 8,9,10 షెడ్యూళ్లపై క్లారిటీ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విభజనలో సీమాంధ్రకు వచ్చిన ఏడు మండలాలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని కూడా నిర్ణయం తీసుకుంది.
రాజధాని ఎంపిక విషయంపై ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు మాట్లాడొద్దని మంత్రులను చంద్రబాబు హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలోశాఖలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మంత్రులకు సూచించారు. బడ్జెట్‌లో రుణమాఫీని ఏ ఖాతాలో చూపించాలనే దానిపై కూడా మంత్రులతో చంద్రబాబు చర్చించారు.