అర్థం చేసుకోండి... : చంద్రబాబు | Chandrababu Naidu seeks to tie up with BJP | Sakshi
Sakshi News home page

అర్థం చేసుకోండి... : చంద్రబాబు

Mar 18 2014 3:03 AM | Updated on Mar 29 2019 5:57 PM

అర్థం చేసుకోండి... : చంద్రబాబు - Sakshi

అర్థం చేసుకోండి... : చంద్రబాబు

బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు.

* బీజేపీతో పొత్తుపై చంద్రబాబు పరోక్ష ప్రస్తావన
* ఎన్టీఆర్ భవన్‌లో పలు కార్యక్రమాల్లో వ్యాఖ్యలు
* టీడీపీలో చేరిన పలువురు కాంగ్రెస్ నేతలు
* సీట్ల కేటాయింపులపై బాబు హామీలకు పట్టు

 
 సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు. సోమవారం ఎన్‌టీఆర్ భవన్‌లో పార్టీ అనుబంధ న్యాయవిభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో, ఆ తర్వాత పలువురు నాయకులను చేర్పించుకున్న సందర్భంలో బాబు మాట్లాడారు. దేశ రాష్ట్ర ప్రయోజనాలకు ఏది ఉపయోగమో ఆ నిర్ణయమే తీసుకుంటానని బీజేపీ పొత్తు విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు. రెండు, మూడు తరాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వారు కూడా పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. కడప జిల్లా ఎవ్వరి సొత్తు కాదని, ప్రస్తుతం చేరిన నేతలతో జిల్లాలో పార్టీ విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
 
 టీడీపీలో పలువురి చేరిక
 పలువురు కాంగ్రెస్ నేతలు భేటీ అయి టీడీపీలో చేరారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ, అనంతపురం జిల్లా  ఎమ్మెల్సీ జి.తిప్పేస్వామి, కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, ఆర్.రమేష్‌రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, తంబళ్లపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి జి.శంకర్‌యాదవ్ తదితరులు టీడీపీలో చేరారు.
  మాజీ మంత్రి తోట నరసింహం, అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా బాబును కలిశారు. తోట త్వరలో పార్టీలో చేరనున్నారు. తనకు జగ్గంపేట అసెంబ్లీ సీటు కావాలని తోట కోరగా కాకినాడ లోక్‌సభ సీటు ఇస్తానని చంద్రబాబు ప్రతిపాదించారు. పొత్తులో కాకినాడ సీటు బీజేపీకి పోతే తన పరిస్థితి ఏమిటని తోట ప్రశ్నించగా ఆ విషయాలన్నీ తర్వాత చర్చించుకుందామని ముందు పార్టీలో చేరమని కోరినట్టు సమాచారం. మధుసూదన్‌గుప్తాకు గుంతకల్ సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన ట్లు సమాచారం.
 
త్వరలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీలో చేరనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. వీరిద్దరికి ఏలూరు, నర్సరావుపేట లోక్‌సభ సీట్లు కేటాయించనున్నారు.
 
నర్సరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహించిన సీటునే కేటాయించాల్సిందిగా బాబును కోరారు. బాబు మాత్రం నర్సరావుపేట సీటును రాయపాటికి కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించుకున్నానని, అందువల్ల గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement