
కౌన్సిలర్ కూడా చంద్రబాబు స్థాయిలో మాట్లాడరు
రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ థర్డ్ రేటెడ్ పొలిటీషియన్ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి దుయ్యబట్టారు.
సాక్షి, అమరావతి:
రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ థర్డ్ రేటెడ్ పొలిటీషియన్ (తక్కువ స్థాయి రాజకీయవేత్త– రాజకీయ పరిభాషలో ఇదో తిట్టు) అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. మున్సిపల్ కౌన్సిలర్ కూడా ఆయన స్థాయిలో పొరుగుదేశంలో మాట్లాడడని మండిపడ్డారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మొదలు రాష్ట్ర స్థితిగతుల వరకు అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు.
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తన హోదాను తక్కువ చేసుకునే నీచస్థాయిలో మాట్లాడారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నానని చంద్రబాబు అనడాన్ని సురవరం తీవ్రంగా ఆక్షేపించారు. 'రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా అభివృద్ధికి సహకరించండి అని అడగడంలో తప్పులేదు. కానీ ఓడిపోకుండా అన్ని చర్యలు తీసుకున్నాను అని విజ్ఞత కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా చెబుతారా? కాలిఫోర్నియాలో అమెరికా, భారత్ వాణిజ్య మండలి (యూఎస్‌ఐబీసీ) సదస్సులో చంద్రబాబు ప్రసంగం ఓ థర్డ్‌క్లాస్ ప్రసంగం. మున్సిపల్ కౌన్సిలర్ కూడా ఆ స్థాయిలో మాట్లాడడు. ఎప్పుడో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? తన స్వోత్కర్ష తాను మాట్లాడుకోవాలి గానీ ఎన్నికల గురించి అమెరికా వాళ్లకు ఎందుకు? అమిత్ షాకు ఎన్నికలు తప్ప మరో ఎజెండా లేదు కనుక ఆయన మాట్లాడుతుంటాడు.
ప్రజా సంక్షేమం, పెట్టుబడుల కోసమంటూ అమెరికాకు పోయిన చంద్రబాబు రాష్ట్ర సమస్యల గురించి చెప్పుకోవచ్చు, రెండు దేశాల సంబంధాల గురించి మాట్లాడవచ్చు. అభ్యంతరం లేదు. కానీ ఇదేం తీరు. స్టేట్స్‌మెన్ (రాజనీతిజ్ఞుడు) ఎవరైనా రాబోయే తరం గురించి మాట్లాడతారు. రాజకీయ నాయకుడు మాత్రమే ఎన్నికల గురించి మాట్లాడతారు. చంద్రబాబో ఓ థర్డ్‌రేటెడ్ రాజకీయవేత్త కూడా కాదేమో. ఎన్నికల గురించి మాట్లాడటం ఎంత అసమంజసం. అనుభవజ్ఞుడని, రాజకీయ అనుభవం ఉందని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు ఇంత నీచంగా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదు.
ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని బాబు చెబుతున్నారు... అంటే దానర్థం రిగ్గింగు చేస్తారా? డబ్బులిచ్చి ఓట్లు కొంటారా? ఎన్నికల ఓటింగ్ యంత్రాలను తారుమారు చేస్తారా? ఏమిటి ఆయన ఉద్దేశం? అమెరికా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఎందుకు? ఓటమి గురించి అంతగా భయపడుతున్నారా? ఏమైనా చంద్రబాబు ప్రసంగం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదు. ' అని సురవరం అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు చంద్రబాబుకు ట్రాన్స్‌ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డా, పరివర్తన అంటే ఇదేనా? అని చమత్కరించారు.
బాబుకు మేమెలా గుణపాఠం చెప్పామో తెలియదా?
కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు ఉన్నదల్లా టూరిజమేనన్న చంద్రబాబుకు తాము 2004 ఎన్నికల్లో ఎలా గుణపాఠం చెప్పామో గుర్తుండే ఉంటుందని వ్యాఖ్యానించారు. దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిస్టుల ఉనికి ఉంటుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటి తరఫున ఒక ఉమ్మడి అభ్యర్థిని పోటీకి పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్షపార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మరింత చొరవ చూపాలన్నారు. కమ్యూనిస్టు పార్టీల విలీనం వేరు, ఐక్య కార్యాచరణ వేరని, తాము ఐక్యతకు కట్టుబడి ఉన్నామని, దానికనుగుణంగా స్పందించాల్సింది ఇతరులేనని చెప్పారు.
హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే ప్రతిఘటన తప్పదని సురవరం అన్నారు. గోరక్షణ దళాల పేరిట ముస్లిం, మైనారిటీలపై దాడులు చేసి భయబ్రాంతుల్ని చేస్తున్నారని, ఇది దేశ సమైక్యత, సమగ్రతకు నష్టదాయకమన్నారు. దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే అన్ని పార్టీలకు వారి ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు ఉంటాయని వివరించారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని, ఓట్లు, సీట్ల కొనుగోలుకు పెద్దఎత్తున ఆస్కారం ఏర్పడుతుందన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లను 2019 ఎన్నికల వరకు కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు.
సీమ కరవుపై 16,17 తేదీల్లో బైఠాయింపు
రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న కరవు పరిస్థితులపై ఈనెల 16,17 తేదీలలో 30 గంటల బైఠాయింపు ఆందోళనకు పిలుపు ఇచ్చినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. పంట పండించిన రైతు మార్కెట్ యార్డుల్లో అల్లాడుతుంటే పండించని రైతు పొట్ట చేతబట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస పోయి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖకు కమిషనర్‌గా ఉండేందుకు ఏ ఒక్క ఐఏఎస్ అధికారి ముందుకు రాని దుస్థితి నెలకొందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జి.ఓబులేసు, నానీ పాల్గొన్నారు.