కనీసం ఉప ప్రధాని పోస్టయినా! | Sakshi
Sakshi News home page

కనీసం ఉప ప్రధాని పోస్టయినా!

Published Wed, Oct 23 2013 3:21 AM

కనీసం ఉప ప్రధాని పోస్టయినా! - Sakshi

ఆనాడు అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి కాదనుకున్నా.. ఈనాడు కనీసం ఉప ప్రధానిని కాలేకపోతానా...? అని అనుకుంటున్నారట టీడీపీ అధినేత. ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు ఏదో అన్నట్టు ఇదెక్కడి లెక్కబ్బా... అని తెలుగు తమ్ముళ్లు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారట. అసలు ఎన్నికలే లేవు.. పైగా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం పార్టీలో ఎవరికీ లేనేలేదు. అలాంటప్పుడు అదీ కేంద్రంలో పెద్ద పోస్టుమీద కన్నేయడంలోని ఆంతర్యమేంటని నేతలు కిందామీదా పడుతున్నారు. ముందేదో చెప్పినా ఇప్పుడు మూడో ఫ్రంట్ ఊసే ఎత్తడం లేదు. మోడీతో జోడీ కట్టాలని ఉబలాటపడుతున్నా అదింకా కుదరనే లేదు. అయినా కాబోయే ఉప ప్రధాని అని ఎందుకు చెప్పుకుంటున్నట్టు...! నేతలకేం పాలుపోవడం లేదట. కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంతో కొందరు నేతలు అసలు దీనివెనుక ఉన్న మర్మమేంటని తెలుసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ‘సుదీర్ఘకాలం సీఎంగా చేశారు. అపొజిషన్ లీడర్‌గా చేశారు. 
 
 అందుకే ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించార’ంటూ కొందరు నేతలు విలేకరుల వద్ద పనిగట్టుకుని ప్రచారం మొదలుపెట్టారు. మీ నాయకుడు ఏం చేసినా దానివెనుక ఏదో ఒక మతలబు ఉంటుంది కదా...! దీనివెనుకా ఏదో ఉండే ఉంటుందని మీడియా మిత్రులు అడిగినప్పుడు ఒక నేత అసలు గుట్టును విప్పారు. ‘గత నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ను కాపాడుతున్నందుకు మా నాయకుడిపై ఈగ కూడా వాలలేదు. రేపటి రోజున కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటారో తెలియదు. రాష్ట్రంలో అధికారం దక్కదని తేలిపోయింది. అందుకే సెంటర్‌లో అన్ని ఆప్షన్స్ ఓపెన్‌గా పెట్టుకున్నారు. కేంద్రంలో ఎవరొచ్చినా ఎమ్మార్, ఐఎంజీ లాంటి కేసులేవీ తిరగదోడే అవకాశం రాకూడదు..!’ అని ఆ నాయకుడు ఏవో లెక్కలు చెబుతుంటే... ఉప ప్రధాని కథ చెప్పమన్నప్పుడు... ‘అన్నా...! ఉప ప్రధాని పదవి అంటే అందులో హోం శాఖ ఉండే అవకాశమూ ఉంది. దాని పరిధిలోనే సీబీఐ ఉంటుంది...’ అంటూ అసలు గుట్టు విప్పడంతో విస్మయపోవడం మీడియా మిత్రుల వంతైందట.

Advertisement

తప్పక చదవండి

Advertisement