జనాభా తగ్గితే ఆర్థిక తిరోగమనం  | Sakshi
Sakshi News home page

జనాభా తగ్గితే ఆర్థిక తిరోగమనం 

Published Mon, Dec 17 2018 3:04 AM

Chandrababu comments about Yadlapati - Sakshi

తెనాలి అర్బన్‌: ఆర్థికంగా ఎదగలేక యువత పెళ్లి విషయంలో పెడదారి పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కొందరు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉంటుంటే, మరికొందరు పిల్లలు వద్దనే లాంటి ఆంక్షలతో పెళ్లి పీటలు ఎక్కుతున్నారని చెప్పారు. దీనివల్ల జనాభా తగ్గి దేశ అభివృద్ధి తిరోగమనం బాట పట్టే ప్రమాదముందని హెచ్చరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్‌ రాజకీయ నేత యడ్లపాటి వెంకట్రావు 100వ జన్మదిన వేడుకలను గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌ యార్డులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జన్మదిన కేక్‌ను యడ్లపాటి వెంకట్రావు దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు కట్‌ చేశారు. వెంకట్రావు దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. యువత టెక్నాలజీకి బానిసలు కాకుండా ఉండాలన్నారు. టెక్నాలజీకి బానిసలు కావటం వల్ల మానసిక ఆందోళనలకులోనై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  యడ్లపాటి వెంకట్రావును అందరూ ఆదర్శంగా తీసుకుని, ఆయన బాటలో నడవాలని సూచించారు.  

రాజకీయాన్ని, వ్యవసాయాన్ని సమ దృష్టితో చూశారు 
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ.. రాజకీయాన్ని, వ్యవసాయాన్ని సమాన దృష్టితో చూసిన గొప్పవ్యక్తి యడ్లపాటి వెంకట్రావు అని కొనియాడారు. రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలకు తావు ఉండకూడదని, నేటి రాజకీయ నాయకులు ఈ విషయాన్ని గమనించి నడుచుకోవాలని సూచించారు. వెంకట్రావును ఆదర్శంగా తీసుకుని, నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ జీవించాలన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే లాం ఫాంలో రైతు విశ్రాంతి భవనాన్ని నిర్మించాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు గాంధీ, కలాంలను ఆదర్శంగా తీసుకోకపోయినా çపర్వాలేదు కానీ యడ్లపాటిని మాత్రం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. 

Advertisement
Advertisement