ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కేక్‌లా కోయడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీకి ఒక చాకులా ఉపయోగపడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కేక్‌లా కోయడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీకి ఒక చాకులా ఉపయోగపడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ... విభజనను ఒక్క వాక్యంతో స్వాగతించి కొత్త రాజధానిని కట్టుకుందామని చెప్పిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఒక అగ్నిగుండంగా మారి ప్రాంతాల మధ్య విద్వేషాలు రగలడానికి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండే కారణమని విమర్శించారు. ఈ రెండు పార్టీలు సీమాంధ్ర ప్రాంతానికి ద్రోహులుగా మారిపోయాయని దుయ్యబట్టారు. నిర్బంధంలో ఉండి కూడా రాష్ట్ర ప్రజల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహారదీక్షకు దిగాల్సి రావడం నిజంగా తమకు బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించేటపుడు సీమాంధ్ర ప్రాంతానికి ఎలా న్యాయం చేయాలి? సాగునీటి సమస్యను ఎలా పరిష్కరించాలి? హైదరాబాద్ నగరం విషయాన్ని ఏం చేయాలి? వంటి అంశాలనేమీ చర్చించకుండా ఏకపక్షంగా, నిరంకుశంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ధ్వజమెత్తారు.
విభజన విషయాన్ని సామరస్యంగా పరిష్కరించడం విస్మరించి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేశారని విమర్శించారు. ఏకపక్షంగా విభజన జరుగుతోందని తెలిసి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి షిండేకు తమ పార్టీ ముందుగానే లేఖలు రాసిందని గుర్తుచేశారు. విభజన ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు కనుక, కాంగ్రెస్‌కు ఆ పని చేతకాదు కనుక రాష్ట్రాన్ని యథాతధంగా ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు.