కరోనా నియంత్రణ ఏపీలో బాగుంది

Central team appreciation to AP Govt On Corona control - Sakshi

కేంద్ర బృందం ప్రశంస

రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అనుసరిస్తున్నారు 

వివిధ రకాల యాప్‌లతో సేవలు సూపర్‌ 

నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది

ఎక్కువ టెస్టులు చేయడం వల్లే ఇన్ఫెక్షన్‌ బయటపడుతుంది.వైరస్‌ ఎవరికి సోకిందో గుర్తించేందుకు ఇదే అత్యుత్తమ మార్గం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ఏపీ అధికారులు ఇచ్చిన వివరాలతో మేం చాలా సంతృప్తి చెందాం. ఇన్ని రకాల యాప్‌లు ఏ రాష్ట్రంలోనూ చూడలేదు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని, టెస్టుల్లో అత్యుత్తమ మార్గాలను అనుసరిస్తున్నారని కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరిశీలన కోసం కేంద్ర బృందం శుక్రవారం విజయవాడ వచ్చింది. ఏఐఐహెచ్‌ అండ్‌ పీహెచ్‌ (ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ హైజీన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌), కోల్‌కతాకు చెందిన డా.మధుమితా దూబే, డా.సంజయ్‌ సాధూఖాన్‌ బృందం కర్నూలులో పర్యటించనుండగా డా.బాబీపాల్, డా.నందినీ భట్టాచార్య బృందం గుంటూరును పరిశీలించనుంది. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.జవహర్‌రెడ్డితో కేంద్ర బృందం సుమారు 45 నిముషాల పాటు సమావేశమైంది. అనంతరం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. 

ఇలా కట్టడి చేస్తున్నాం : ఏపీ అధికారులు
► ఇన్ఫెక్షన్‌ ఉన్న బాధితులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మూడు దశల్లో ఇంటింటి సర్వే నిర్వహించింది. 
► రాష్ట్రంలో కోటిమంది స్మార్ట్‌ఫోన్‌లు, మరో 1.5 కోట్ల మంది జియో ఫోన్‌లు వినియోగిస్తున్నారు. ఇప్పటివరకూ 48.58 లక్షల మంది ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు
► ఎంఐఎస్, ఎంఎస్‌ఎస్, ఫార్మసీ తదితర యాప్‌ల ద్వారా ప్రతిఒక్కరి వివరాలూ సేకరించగలిగాం.
► బాధితుల వద్దకే వైద్య సిబ్బందిని పంపి వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం
► కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో 255 ఫీవర్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేశాం రాష్ట్రంలో 90 టెస్టులు చేసే స్థాయినుంచి 10 వేల పరీక్షలు చేసే స్థాయికి ఎదిగాం
► ట్రూనాట్, ఆర్టీపీసీఆర్, క్లియా మెషీన్స్‌ ద్వారా టెస్టులు చేస్తున్నాం. క్లియా టెస్టులు దేశంలో ఏపీలో మాత్రమే జరుగుతున్నాయి.
► రెడ్‌జోన్లలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వ్యాధి లక్షణాలున్నా  ఆస్పత్రికి రావడంలో జాప్యం చేయడంతో కొందరు మృతి చెందారు
► భోజనం, వసతి సదుపాయాలపై క్వారంటైన్‌లో ఉన్నవారి నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరించి చర్యలు తీసుకుంటున్నాం. 24 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాం.
► ఐఎంఎస్‌ (ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) ద్వారా ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపడుతున్నాం
► రాష్ట్రంలో పాజిటివ్‌ బాధితుల్లో 80 శాతం మంది ఎసింప్టమాటిక్‌ (ఎలాంటి లక్షణాలు లేని) వారే ఉన్నారు. ఎక్కువ టెస్టులు చేయడం వల్ల వారిని గుర్తించగలిగాం
► నెట్‌వర్క్‌ ట్రాన్స్‌మిషన్‌ ఎనాలసిస్‌ (ఒక కేసు ఎలా వచ్చింది? ఎలా వ్యాపించింది?)లో భాగంగా సూపర్‌ స్ప్రెడర్స్‌ను గుర్తించాం.

చాలా బాగుంది: కేంద్ర బృందం
► రకరకాల యాప్‌లతో రాష్ట్రంలో చేపట్టిన చర్యలు చాలా బాగున్నాయి. ఇన్ని రకాల యాప్‌లు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా చూడలేదు
► ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. టెస్టుల్లో మంచి ప్రతిభ కనపరిచారు
► నిర్ధారణ పరీక్షలు అత్యధికంగా చేస్తున్న నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి.
► రాష్ట్రంలో ఐటీ సేవలు చాలా బాగున్నాయ్‌. మరింత మందికి వీటిని విస్తరించాలి.
► సాధారణంగా లక్షణాలున్న వారికే టెస్టులు చేయలేని పరిస్థితుల్లో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్‌ ఉందని గుర్తించడం గొప్ప విషయం
► ఏపీలో నమూనాల సేకరణ, నిర్ధారణ పరీక్షలకు అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయి
► కంటైన్మెంట్‌ క్లస్టర్స్‌లో తీసుకుంటున్న జాగ్రత్తలు, పాజిటివ్‌ వ్యక్తులను గుర్తించేందుకు తీసుకుంటున్న చర్యలు భేష్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top