చచ్చినా..చావే

Burial Ground Conflicts in Chittoor - Sakshi

శ్మశాన దారిలో గాడి తవ్వేసిన రైతు

స్థలం తనదంటూ ఆక్షేపణ

వేణుగోపాలపురంలో స్వల్ప ఉద్రిక్తత

రెవెన్యూ అధికారుల జోక్యంతో తాత్కాలికంగా తెర

ఆపై అంత్యక్రియలు

చిత్తూరు: శ్మశాన వాటికకు వెళ్లే  దారికి అడ్డంగా జేసీబీతో గాడి తవ్వి ఆ భూమి తనదంటూ అంటూ ఓ రైతు చావు కష్టాలు తెచ్చిపెట్టాడు. ఫలితంగా అంత్యక్రియలకు బయల్దేరిన శవాన్ని  పాడెతో సహా అక్కడ కిందకు దించాల్సి వచ్చింది! ఓ వైపు ఖనన సమయం దాటుతోంది. దారి వదిలేది లేదంటూ భీష్మించుకున్న రైతు. శవంతో ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో చివరకు రెవెన్యూ అధికారులు కదిలారు. సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు.

శ్రీరంగరాజపురం: మండలంలోని  వేణుగోపాలపురం జనార్ధన్‌రెడ్డి (23) అనారోగ్యంతో చనిపోయాడు. గురువారం అతడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధం చేశారు. గ్రామానికి కిలోమీటరు దూరంలోని శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలిస్తుండగా మార్గమధ్యంలో దారి సమస్య తలెత్తింది. శ్మశానానికి ఆనుకుని భూమి ఉన్న ఓ రైతు తన పొలం మీదుగా ఉన్న శ్మశాన కాలిబాట స్థలంలో జేసీబీతో గాడి తవ్వేశాడు. స్థలం తనదని, శవాన్ని ఇటు వైపు తీసుకెళ్లరాదంటూ ఆక్షేపించాడు. అసలే దుఃఖంలో ఉన్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులకు మండుకొచ్చింది. రైతు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఉదంతాన్ని రెవెన్యూ అధికారులకు చేరవేశారు. శ్మశాన దారి సమస్యను పరిష్కరించని పక్షంలో చిత్తూరు–పుత్తూరు  జాతీయ రహదారిపై  మృతదేహంతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి  అదుపు తప్పుతోందని గ్రహించిన రెవెన్యూ సిబ్బంది ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. శ్మశానానికి వెళ్లే  దారిని పరిశీలించారు. గ్రామస్తులు, సంబంధిత రైతుతో  ఏఆర్‌ఐ ఏకాంబరం, వీఆర్‌ఓ మోహన చర్చించారు. ప్రస్తుతం ఉన్న దారి మీదుగానే మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్లేలా ఒప్పించారు. దారికి అవరోధంగా ఉన్న గాడిని పూడ్చివేశారు. 2 గంటల పాటు చెట్ల కింద పడిగాపులు కాసిన మృతదేహం మళ్లీ నలుగురి భుజాలకెక్కింది.ఆపై, పలకల చప్పుడు మళ్లీ మార్మోగింది. శ్మశానానికేసి సాగింది!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top