రాష్ట్రానికి నిరాశ మిగిల్చింది

Buggana Rajendranath is deeply disappointed with the Union Budget 2020 - Sakshi

కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన తీవ్ర అసంతృప్తి

ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి హామీ రాలేదు 

పోలవరం చెల్లింపుల్లో జాప్యం  

పారిశ్రామిక ప్రోత్సాహకాలు లేనే లేవు 

2020–కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన తీవ్ర అసంతృప్తి 

అప్పు శాతం తగ్గించడం మంచి పరిణామమన్న మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2020–బడ్జెట్‌ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించిందని, అన్యాయం జరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి మొత్తంమీద మందగమనంలో సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టాక ఆయన శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోందన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్యాకేజీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చేప్పుడు ఎన్నో వదులుకున్నామని, అవన్నీ మనకు రాలేదన్నారు. రాష్ట్రానికి చాలా ఇబ్బందికర పరిస్థితులున్నాయని ఈ విషయమై ఎన్నోసార్లు కేంద్రానికి విన్నవిస్తూనే ఉన్నామని బుగ్గన వివరించారు.  

స్థూల ఉత్పత్తి 10 శాతం అంటే ప్రశ్నార్థకం  
రాబడి అంతా స్థూల ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటుంది.. స్థూల ఉత్పత్తి 10 శాతం అంటున్నారంటే అది ప్రశ్నార్థకంగా ఉందని తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందనడం అనుమానాస్పదమేనన్నారు. గత బడ్జెట్‌లోనూ ఇలాగే చెప్పారని, కానీ అంచనాలన్నీ తప్పాయ్యాయన్నారు. బడ్జెట్‌ పూర్తిగా ప్రశ్నార్థకంగా తయారైందని, జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం వాటా ఇవ్వాల్సిందేనని, ఏడెనిమిది రాష్ట్రాలకు తప్పితే మిగిలిన రాష్ట్రాలన్నింటికీ రీయింబర్స్‌ చేయాలన్నారు. 2018–19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటాను రూ.2,500 కోట్లకు తగ్గించారని, ఇది రాష్ట్రానికి పెద్ద దెబ్బని బుగ్గని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా రాలేదని అయితే అప్పు శాతం తగ్గించడం మంచి పరిణామమన్నారు. గోదాముల సామర్థ్యం పెంపు, ధాన్యలక్ష్మి, కిసాన్‌ రైలు ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. ‘కృషి ఉడాన్‌’ ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమని, వెనుకబడిన జిల్లాల్లో ఆస్పత్రుల నిర్మాణానికి ఆయుష్మాన్‌ భారత్‌ నిర్ణయం మంచిదేనన్నారు. నూతన విమానాశ్రయాల నిర్మాణం, డేటా సెంటర్‌ పార్కుల ఏర్పాటు, చిన్న పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ ఆహ్వానించదగ్గవేనన్నారు.

డబ్బు ఆదా చేస్తే యనమలకు బాధ ఎందుకు? 
కేంద్ర బడ్జెట్‌పై యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తమది అవినీతి, అసమర్థ పాలన అంటున్నారని, ఏడు నెలల్లోనే తమది అసమర్థ పాలనా? అని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను సరిదిద్దేందుకు తమకు సమయం పడుతుందని.. ఐదేళ్లలో టీడీపీ చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై రివర్స్‌ టెండరింగ్‌ చేసి రూ.1,900 కోట్లు మిగల్చడం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పా? అంటూ నిలదీశారు. పోలవరంలోనూ.. బొగ్గు రవాణా మొదలు వెలిగొండ, కంప్యూటర్లు, ప్రింటర్ల వరకూ ప్రతి దాంట్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా తగ్గిస్తే యనమలకు బాధెందుకని ప్రశ్నించారు.

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో కొన్ని కంపెనీలతో లాలూచీపడినందునే తాము సమీక్షించినట్టు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్లే వినియోగదారులపై విద్యుత్‌ బిల్లుల భారం పడిందని.. ఆయన చేసిన పనికి ఇప్పుడు సింగపూర్‌లో అల్లకల్లోలం జరుగుతోందని, అక్కడ ఓ ఆర్థిక మంత్రి పదవి కూడా ఊడబోతోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక అసమర్థ ప్రతిపక్షం ఉందని ధ్వజమెత్తారు. టీడీపీ వారు వట్టి తుగ్లక్‌లు కాదని వారు దుర్మార్గమైన తుగ్లక్‌లని, పాపపు పనులు చేసి నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన పెండింగ్‌ బిల్లులు చెల్లించడానికే తమకు ఆరు నెలలు పట్టిందని అచ్చంగా తుగ్లక్‌ పనులు చేసింది చంద్రబాబేనని విరుచుకుపడ్డారు. 

కార్యాలయాల తరలింపులో తప్పు లేదు 
అమరావతి నుంచి కార్యాలయాల తరలింపులో ఏ మాత్రం తప్పులేదని, ఈ విషయం శ్రీబాగ్‌ ఒప్పందంలో స్పష్టంగా ఉందని బుగ్గన అన్నారు. ప్రజా తీర్పును మందబలంతో టీడీపీ వారు శాసనమండలిలో అడ్డుకున్నారని, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top