అంతు చిక్కని వ్యాధితో నాలుగేళ్లుగా నరకయాతన

Boy Suffering With Unknown Disease From Four Years At Prakasam District - Sakshi

పుట్టిన గంట తరువాత ప్రబలిన చర్మ వ్యాధి

చేప పొలుసుగా ఊడిపోతున్న చర్మం

వేసవిలో శరీరం పగిలి రక్తస్రావం

వైద్యులకు కూడా అంతుబట్టని వ్యాధి

కందుకూరు అర్బన్‌:  ఆడుతూ పాడుతూ అందరు పిల్లలతో కలిసి బడికి వెళ్లాల్సిన వయస్సులో నిత్యం చర్మం పగిలి, దురద, మంటతో  ఆ బాలుడు నరక యాతన అనుభవిస్తున్నాడు. తోటి పిల్లలు దగ్గరకు రానివ్వక ఆ బాలుడు పడుతున్న మానసిక వేదన తల్లిదండ్రులతో పాటు చూసిన గ్రామస్తులను కలిచివేస్తోంది. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం ఎస్సీ కాలనీలోని లింగాబత్తిన మాల్యాద్రి, శ్రీలతలది రోజు కూలీ పనులకు వెళితే కానీ పూటగడవని పరిస్థితి.

ఈ దంపతులకు మూడవ సంతానం జోష్‌కుమార్‌ 2015లో జన్మించాడు. గంటలోపే బాలుడి చేతులు, కాళ్లు, ముఖంపై చర్మం మొత్తం పొరలు పొరలుగా ఊడి పోవడం ప్రారంభమైంది. ఈ వ్యాధి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి రాదని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు వడ్డీకి అప్పుచేసి రెండేళ్లపాటు వైద్యం చేయించారు. అయినా తగ్గలేదు. ఇక చూపించే స్తోమత లేక బిడ్డను ఇంటి దగ్గర వదిలి కూలీనాలి చేసుకుంటున్నారు. గత రెండేళ్లుగా చెన్నైలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చూపిస్తూ నెలకు రూ. 5వేల ఖర్చుతో మందులను వాడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

వేసవి వచ్చిందంటే నరకమే..
వేసవి కాలం వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నట్లు బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒళ్లంతా చర్మం పగిలి రక్తం కారడం, దురద, భరించలేని మంటతో బాలుడు తట్టుకోలేక అల్లాడుతుంటే తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఎండను తట్టుకునేందుకు ప్లాస్టిక్‌ టబ్‌లో నీళ్లుపోసి దాంట్లో ప్రతి అరగంటకు ఒకసారి కూర్చోబెడుతున్నారు. బైట ఉన్నంత సేపూ తడి బట్టలు కప్పితేనే ఉపశమనం. కూలి పనులకు వెళ్తేనే గానీ పూటగడవని పరిస్థితుల్లో పిల్లవాడిని కనిపెట్టుకొని ఒకరు ఇంటి వద్దనే ఉండాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా బడేవారిపాలెం వచ్చినప్పుడు పిల్లవాడి తల్లి జోష్‌కుమార్‌ను జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకొచ్చి తన కుమారుడి దీనగాథను వివరించి మెరుగైన వైద్యం అందించాలని కోరింది. అప్పట్లో కందుకూరులో జరిగిన బహిరంగ సభలో వింత వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడిని చూశానని అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీలో ఇలాంటి వ్యాధులను కూడా చేరుస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top