బాలుడి మృతదేహం లభ్యం

boy dead body available - Sakshi

మంత్రి రాజప్ప తమ్ముడి కుక్క తరమడం వల్లే  కాలువలో పడ్డాడు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి 

బాధిత కుటుంబానికి అండగా దళిత నాయకుల ఆందోళన

అమలాపురం టౌన్‌ : అమలాపురం ఎర్రవంతెన సమీపంలో కాలువలో పడి గల్లంతైన నల్లి వరుణ్‌కుమార్‌ (14) మృతదేహం శనివారం ఉదయం ఆరు గంటలకు లభ్యమైంది. వరుణ్‌కుమార్‌ శుక్రవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితులతో కలసి ఆటలాడుకుంటుండగా పెంపుడు కుక్క తరమడంతో ఆ బాలుడు కాలువ ఐరన్‌ గ్రిల్‌ ఎక్కి కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. సంఘటన స్థలానికి సమీపంలోనే ఉన్న  డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఇంట్లోంచి వచ్చిన పెంపుడు కుక్క తరమడం వల్లే వరుణ్‌కుమార్‌ ఈ ప్రమాదానికి గురయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వరుణ్‌కుమార్‌ మృతదేహం లభ్యం అయ్యాక అతని తండ్రి, బ్యాంక్‌ ఉద్యోగి నెల్లి తిరుపతిరావు శనివారం ఉదయం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా నిమ్మకాయల జగ్గయ్యనాయుడు పెంపుడు కుక్క వల్లే తన కుమారుడు కాలువలో పడి చనిపోయాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ సీహెచ్‌ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. 

మృతదేహం ఆస్పత్రికి తరలింపుపై వివాదం
బాలుని మృతదేహం కోసం శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకూ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలించారు.  ఉదయం ఆరు గంటలకు మృతదేహం లభ్యం కాగానే ఆమృతదేహాన్ని కుటుంబ సభ్యుల వద్దకు తీసుకు వెళ్లకుండా... వారికి చూపించకుండా పోస్టుమార్టం కోసం నేరుగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి బంధువులతో దళిత సంఘాల నాయకులు పోలీసుల చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏరియా ఆస్పత్రి వద్ద, బాలుని ఇంటి వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ ఏవీఎల్‌ ప్రసన్నకుమార్‌ జోక్యం చేసుకుని ఆందోళనకారులతో మాట్లాడి బాలుడి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు. 

మిన్నంటిన రోదనలు
మృతదేహాన్ని చూసిన వరుణ్‌కుమార్‌ తల్లిదండ్రులు, అక్కలు, బంధువులు ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. ఒక్కడే కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కుటుంబం ఈ దుర్ఘటనను తట్టుకోలేకపోయింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తమ్ముడిని కోల్పోయిన అక్కలు విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.

శవ పంచనామాలోనూ ఫిర్యాదులు
బాలుడి మృతదేహానికి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తహసీల్దార్‌ బేబీ జ్ఞానాంబ, వీఆర్వోల సమక్షంలో శవ పంచనామా చేశారు. వరుణ్‌కుమార్‌ మృతదేహంపై గాయాలు ఉండడంతో కుక్క కాట్ల వల్లే ఆ గాయాలు అయ్యాయని బాలుడి తండ్రి తిరుపతి రావుతో పాటు దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. జగ్గయ్యనాయుడు పెంపుడు కుక్క వల్లే వరుణ్‌కుమార్‌ మృతి చెందినట్టు వారు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. జగ్గయ్యనాయుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. దాన్ని పోలీసు అధికారులు నమోదు చేసుకున్నారు. దళిత సంఘాల నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, జంగా బాబూరావు, పెయ్యల శ్రీనివాసరావు, గెడ్డం సంపదరావు, చిల్లా పురుషోత్తం, సబ్బిత కృష్ణ ప్రసాద్, కోలా త్రిమూర్తులు, నక్కా సంపత్‌కుమార్, బొంతు బాలరాజు, పెయ్యల పరశురాముడు తదితరులు బాధిత కుటుంబానికి అండగా నిలిచి అధికారులతో చర్చల్లో పాల్గొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా బాలుడి ఇల్లు, ఆస్పత్రి వద్ద సీఐలు జి.దేవకుమార్, సీహెచ్‌ శ్రీరామ కోటేశ్వరరావు, అయిదుగురు ఎస్సైలతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోస్టుమార్టం తర్వాత మరో వివాదం 
అమలాపురం టౌన్‌: పెంపుడు కుక్క తరమడంతో కాలువలో పడి గల్లంతై మృతి చెందిన నెల్లి వరుణ్‌కుమార్‌ పోస్టుమార్టం అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద దళిత నాయకులు మరో అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో మరో వివాదం అనివార్యమైంది. పోలీసు కేసులో చనిపోవటానికి కారణం రాసే కాలమ్‌లో ఐపీసీ 174 సెక్షన్‌తో అనుమానస్పద మృతిగా నమోదు చేయడంపై దళితనాయకులు అభ్యంతరం చెప్పారు. పోస్టుమార్టం ముందు పోలీసు అధికారులు ఇచ్చిన హామీ మేరకు కాకుండా మరోలా పేర్కొనడంతో వివాదం మొదలైంది. దాంతో పోస్టు మార్టం పూర్తయినా బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకు వెళ్లకుండా ఆందోళన చేశారు. అప్పుడు పోలీసు అధికారులు కేసు పత్రంపై మృతికి కారణం రాసే కాలమ్‌లో నిమ్మకాయల జగ్గయ్య నాయుడు పెంపుడు కుక్కను వదిలేయడం వల్ల బాలుడు మరణించినట్టు రాయడంతో వివాదానికి తెరపడింది. అప్పుడు మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

కవల పిల్లల్లో ఒకడు 
వరుణ్‌కుమార్‌ తండ్రి తిరుపతిరావుకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు సంతానం. ముగ్గురు కుమార్తెల్లో ఒకరు, వరుణ్‌కుమార్‌ కవల పిల్లలు. తనతో పాటు ఒక్కసారే పుట్టిన సోదరుడు మృతి చెందడంతో ఆ సోదరి వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు అందరినీ బాధిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top