రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాజకీయ సమాధి తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు.
కార్పొరేట్ల కోసమే భూ సేకరణ బిల్లు
జైల్ భరోలో సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య
కడప సెవెన్‌రోడ్స్ : రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాజకీయ సమాధి తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు. భూ సేకరణ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సీపీఐ ఇచ్చిన దేశ వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. మండుటెండలో గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసు వలయాన్ని చేధించుకుని కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు.
పలువురు సీపీఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌కు తరలించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్‌తో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల అనుమతి అవసరం లేదని, సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ సర్వేతో పనిలేదని మోడీ సర్కార్ 2013 నాటి చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందన్నారు. బహుళ పంటలు పండే భూములను సైతం సేకరించేందుకు వీలుగా సవరణలు పొందుపరిచారన్నారు.
వివిధ రాజకీయ పక్షాలు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. చట్ట సవరణలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.చంద్ర, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, నగర కార్యదర్శి కేసీ బాదుల్లా, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి పి.చంద్రశేఖర్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎన్.విజయలక్ష్మి, బీకేఎంయూ జిల్లా గౌరవాధ్యక్షుడు పి.కృష్ణమూర్తి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు గంగా సురేష్, అంకుశం, ఏఐవైఎఫ్ నాయకులు కొమ్మద్ది ఈశ్వరయ్య, మద్దిలేటి, ఏఐటీయూసీ నాయకులు డబ్ల్యు రాము, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.