
‘బెల్ట్’ తీస్తున్నారు!
ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల వేటలో పడ్డారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు గ్రామాల్లో పాగా వేశారు
బెల్ట్‌షాపుల వేటలో ఎక్సైజ్ అధికారులు
వాటికి మద్యం సరఫరా చేస్తే క్రిమినల్ కేసులు
ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల వేటలో పడ్డారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు గ్రామాల్లో పాగా వేశారు. ఒక్క షాపు కూడా ఉండకూడదంటూ జిల్లా అధికారులు స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో 15 మద్యం షాపులు, 8 బార్‌లు ఉన్నాయి. రాజుపాళెం, చాపాడు, ప్రొద్దుటూరు రూరల్ గ్రామాలలో నాలుగు మద్యం షాపులున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకూ రాజుపాళెం మండలంలో 20, ప్రొద్దుటూరు రూరల్ మండలంలో 26, చాపాడు మండలంలో 30 దాకా బెల్ట్ షాపులుండేవి. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో కూడా 20కి పైగా అనధికార మద్యం షాపులు నడిచేవి. మండలాల్లో అయితే ప్రధాన షాపులకు అనుబంధంగానే బెల్ట్ షాపులు నడిచేవి. పట్టణాల్లో కూడా ఆయా మద్యం షాపుల ఆధ్వర్యంలోనే అధికంగా అనధికార విక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే రూ. లక్షలు వెచ్చించి బెల్ట్ షాపులను ఏర్పాటు చేసుకున్నారు.
మద్యం షాపులకు నోటీసులు జారీ
బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇన్ని రోజుల నుంచి కుర్చీలకే పరిమితమైన అధికారులు పరుగులు తీస్తున్నారు. బెల్ట్ షాపుల తొలగింపుపై ప్రభుత్వం ఈ నెల 8న 263 జీఓను జారీ చేసింది. రెండు రోజుల క్రితం వరకూ ముందస్తుగా మద్యం షాపుల యజమానులతో పాటు బెల్ట్ షాపు నిర్వాహకులకు ఎక్సైజ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనధికార విక్రయాలు ఎక్కడా జరగరాదని తెలిపారు. అయినప్పటికీ చాలా చోట్ల బెల్ట్ షాపులుండటంతో దాడులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మద్యం షాపు, బార్‌ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. తమ షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయరాదని, 1-2 కంటే ఎక్కువగా మద్యం సీసాలను బయటికి ఇవ్వరాదని నోటీసులో పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే షాపు లెసైన్స్‌ను రద్దు చేయడమే గాక క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు నోటీసులో తెలిపారు. ఈ మేరకు మద్యం షాపుల నిర్వాహకుల నుంచి హామీ పత్రం కూడా అధికారులు తీసుకున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నియంత్రణకు పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులతో పాటు స్వయం సహాయక సంఘాలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు.