సంపూర్ణం | Bandh sucessful in ysr district | Sakshi
Sakshi News home page

సంపూర్ణం

Jan 4 2014 2:32 AM | Updated on Sep 2 2017 2:15 AM

రాష్ర్ట విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కడపలో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ జరిగింది.

సాక్షి, కడప: రాష్ర్ట విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కడపలో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఉదయమే పార్టీ కార్యకర్తలు అప్సరసర్కిల్‌లో రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. మోటర్‌సైకిళ్లను కూడా తిరగనివ్వలేదు.  అంజాద్‌బాషా నేతృత్వంలో కార్యకర్తలు వాహనాల్లో నగరమంతా తిరిగిబంద్‌ను పర్యవేక్షించారు. దుకాణాలను మూయించారు. జిల్లా అధికారప్రతినిధి అఫ్జల్‌ఖాన్ కూడా బంద్ చేయించారు. ఆర్టీసీబస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. దీంతో ఆర్టీసీబస్టాండ్ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
 
 ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఏపీఎన్జీవోలు కూడా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వకార్యాలయాలు, బ్యాంకులు మూసేశారు. పట్టణకన్వీనర్ పోలా శ్రీనివాసులరెడ్డి బంద్‌లో పాల్గొన్నారు. మైదుకూరులో పార్టీ క్రమశిక్షణకమిటీ సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. పట్టణంలో తిరిగి దుకాణాలను మూయించారు. ఉపాధ్యాయులు కూడా బంద్‌లో పాల్గొన్నారు. పార్టీనాయకులు మదీనా దస్తగిరి, ధనపాలజగన్, షౌకత్‌అలీ బంద్‌ను పర్యవేక్షించారు. పులివెందులలో పార్టీ మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రభుత్వ కార్యాలయాలు మూసేశారు. ఎన్జీవోలు బంద్‌లో పాల్గొన్నారు. వ్యాపార దుకాణాలను కూడా స్వచ్ఛందంగా మూసేశారు.
 
 రైల్వేకోడూరులో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మానందరెడ్డి, పంజం సుకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. వైఎస్సార్‌సర్కిల్‌లో రెండుగంటలపాటు బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. సమైక్యనినాదాలు చేశారు. ఏపీఎన్జీవోలు కూడా బంద్ చేశారు. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని దుకాణాలను మూయించారు. బద్వేలులో  మునిసిపల్ మాజీ చైర్మన్ మునెయ్య ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఆర్టీసీబస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూసేశారు. పోరుమామిళ్లలో గాంధీ విగ్రహం నుంచి బస్టాండ్ వరకూ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి బంద్ చేపట్టారు. కమలాపురంలో మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారదుకాణాలను మూయించారు. వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు.  జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ నాయకురాలు అల్లెప్రభావతి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. పట్టణంలో ర్యాలీ, పాతబస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారదుకాణాలను మూయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రొద్దుటూరులో పార్టీ కార్యకర్తలు బంద్ చేపట్టారు. ఆర్టీసీబస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. వ్యాపారసంస్థలను మూయించారు.
 
 రాజీవ్ సర్కిల్‌లో  మానవహారం చేపట్టారు. బంద్‌లో గోపవరం సర్పంచ్ దేవీప్రసాద్‌రెడ్డి, మురళీధరరెడ్డి పాల్గొన్నారు. రాయచోటిలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ దేవనాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉదయమే ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారదుకాణాలను  మూసేశారు. ఏపీ ఎన్జీవోలు కూడా బంద్ నిర్వహించారు. ఆర్టీసీబస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పోలీసులు గట్టిబందోబస్తు చర్యలు తీసుకున్నారు.
 
 కడపలో మినహా కనిపించని ‘తమ్ముళ్ల’ బంద్:
 ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో జరిగే సమైక్యబంద్‌కు సంపూర్ణమద్దతు ప్రకటిస్తున్నట్లు తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి గురువారం ప్రకటించారు. అయితే శుక్రవారం కడపలో మినహా తక్కిన  ఏ నియోజకవర్గంలో కూడా తెలుగుతమ్ముళ్లు కనిపించలేదు. కడపలో మాత్రం పార్టీ నేతలు గోవర్దన్‌రెడ్డి, అమీర్‌బాబు కాసేపు నగరంలో కలియతిరిగారు. పుత్తా నరసింహారెడ్డి నాయకత్వం వహిస్తున్న  కమలాపురం, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం జమ్మలమడుగుతో పాటు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొద్దుటూరులో కూడా పచ్చజెండా ఆచూకీ కనిపించలేదు. దీంతో బంద్‌కు మద్దతును ప్రకటించడం, పార్టీ కార్యకర్తలు మాత్రం బంద్‌లో పాల్గొనకపోడం ఏంటని జిల్లా వ్యాప్తంగా చర్చ మొదలైంది. అసెంబ్లీకి తెలంగాణబిల్లు వచ్చినపుడు కూడా ఇదే రకంగా తమ్ముళ్లు వ్యవహరించారని, మళ్లీ ఇదే పునరావృతం కావడం చూస్తే వారి మనోగతం ఏంటో అంతుపట్టడం లేదని చర్చించుకుంటున్నారు.  బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనలేనప్పుడు ప్రకటనలు చేయడం ఎందుకుని విమర్శిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement