కొత్త పోలీస్‌ బాస్‌ ఠాకూర్‌

AP new police boss is RP Thakur - Sakshi

నియామక ఉత్తర్వులిచ్చిన వెనువెంటనే పదవీ బాధ్యతలు చేపట్టిన ఠాకూర్‌

పోలీసుశాఖలో పారదర్శకత తీసుకొస్తానన్న కొత్త డీజీపీ

తప్పు చేస్తే ఎవర్నీ ఉపేక్షించబోనని స్పష్టీకరణ

మాలకొండయ్య పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ ఎం.మాలకొండయ్య పదవీ విరమణ చేసే సమయం వరకు కొత్త డీజీపీని ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నానికి సస్పెన్స్‌కు తెరదించింది. ఠాకూర్‌ను డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ వెనువెంటనే ఆయన మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. మాలకొండయ్య నుంచి బాధ్యతలను స్వీకరించారు.

అనంతరం మీడియా సమావేశంలో ఠాకూర్‌ మాట్లాడుతూ తన హయాంలో తప్పు చేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజం, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేస్తానన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ తెస్తానని చెప్పారు. ప్రతి నెల ఒక కానిస్టేబుల్, హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంటికెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటానన్నారు. పోలీస్‌ శాఖలో పారదర్శకత తీసుకొస్తానన్నారు. సమావేశంలో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఆర్‌ అనురాధ, శాంతిభద్రతల ఏడీజీ హరీష్‌కుమార్‌ గుప్త, సీఐడీ ఏడీజీ అమిత్‌గార్గ్, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరావు ఉన్నారు.అంతకుముందు ప్రస్తుత డీజీపీ ఎం.మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌ మైదానంలో వీడ్కోలు పెరేడ్‌ నిర్వహించారు. మాలకొండయ్యను ప్రత్యేక వాహనంపై కూర్చోబెట్టి రాష్ట్రంలోని ఐపీఎస్‌లు దాన్ని లాగుతూ గౌరవంగా సాగనంపారు. కాగా, డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఠాకూర్‌ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.

ఇదీ ఠాకూర్‌ ప్రస్థానం..
ఠాకూర్‌ పూర్తి పేరు రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌. 1961 జూలై 1న జన్మించిన ఆయన ఐఐటీ కాన్పూర్‌ నుంచి ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్నారు. 1986 డిసెంబర్‌ 15న ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు, వరంగల్‌ జిల్లాల్లో ఏఎస్పీగా, పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్‌ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. జోనల్‌ హైదరాబాద్‌ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు రేంజ్‌ డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు.

అనంతరం పదోన్నతిపై హైదరాబాద్‌లోని డ్రగ్స్‌ అండ్‌ కాపీ రైట్స్‌ డీజీగా బాధ్యతలు చేపట్టారు. ఏడీజీగా ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్‌ ఆఫ్‌ లీగల్‌ మెట్రాలజీ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ, శాంతిభద్రతలు(లా అండ్‌ ఆర్డర్‌)ఏడీజీగా బాధ్యతలు నిర్వహించారు. 2016 నవంబర్‌ 19 నుంచి ఏపీ అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2003లో ఇండియన్‌ పోలీసు మెడల్, 2004 లో ఏఎస్‌ఎస్పీ మెడల్‌ సాధించారు. పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్‌ పొందారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top