విద్యుత్‌ సమస్యలకు చెక్‌

AP Govt Plans To Solve Electricity Problems - Sakshi

త్వరలోనే అంబుడ్స్‌మన్, ఫోరం ఏర్పాటు

నియంత్రణ మండలి కార్యాచరణ

పెరగనున్న పారదర్శకత

సాక్షి, ఒంగోలు మెట్రో: విద్యుత్‌ సమస్యలకు సత్వరమే చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధికారుల్లో మరింత బాధ్యతని, వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారాలను సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కోసం ప్రభుత్వం విద్యుత్‌ నియంత్రణ మండలి ద్వారా చర్యలు చేపట్టనున్నది. విద్యుత్‌ నియంత్రణ మండలి కార్యకలాపాలు ప్రారంభం అయ్యే క్రమంలో ఏర్పడే ప్రత్యేక విద్యుత్‌ అంబుడ్స్‌మన్‌లు మరింతగా ప్రజలకు సేవలు అందిస్తాయి. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యుత్‌ వినియోగదారుల ఫోరం ఏర్పాటు చేసి వినియోగదారులు, అధికారుల సమన్వయంతో పనిచేయనున్నారు. తద్వారా మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇంకోవైపు నియంత్రణ మండలి ద్వారా వినియోగదారుల బాధ్యతలను కూడా గుర్తు చేయనున్నారు.

గత ప్రభుత్వ హయాంలో మూలనడిన విద్యుత్‌ నియంత్రణ మండలికి ఇప్పుడు కదలిక వచ్చి కార్యాచరణలోకి వస్తున్నది. నిజానికి విద్యుత్‌ వినియోగదారులకు హక్కులే కాదు, బాధ్యతలూ ఉంటాయి. అలాగే విద్యుత్‌ రంగంలోని అధికారుల్లో కూడా అంకితభావం, బాధ్యత మరింతగా పెరగాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రయత్నాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రారంభిస్తున్నది. క్షేత్రస్ధాయిలో ఆచరణ కోసం సంబంధిత అధికారులకు కూడా శిక్షణ ఇస్తున్నది. ప్రస్తుతం ఒక్కో ఇంటికి ఏడాదికి 1000 యూనిట్ల విద్యుత్‌ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకు విద్యుత్‌ సేవల సామర్థ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

విద్యుత్‌ వినియోగదారుల రక్షణ చట్టం
వినియోగదారుల రక్షణ చట్టం–1986 ప్రకారం.. విద్యుత్‌ సరఫరాలో ఏవైనా లోపాలు ఏర్పడితే తక్షణం తీసుకునే చర్యల గురించి చర్చించాలి. ఈ చట్టాన్ని అనుసరించే విద్యుత్‌ సరఫరాను ‘సేవ అనే నిర్వచనంలోకి తెచ్చారు. ఈ క్రమంలో న్యాయ సేవాధికార సంస్థల చట్టం–1987 కూడా ప్రజలకు చేసే విద్యుత్‌ సరఫరాను ప్రజా వినియోగ సేవల నిర్వచనంలో చేర్చారు. దీని ప్రకారం విద్యుత్‌కు సంబంధిచిన ఏదైనా వివాద పరిష్కారం కోసం శాశ్వత లోక్‌ అదాలత్‌ను కూడా వినియోగదారుడు ఆశ్రయించే అవకాశం కల్పించారు.

అత్యవసర సేవల నిర్వహణ చట్టం–1981
అత్యవసర సేవల నిర్వహణ చట్టం 1981లో కూడా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా లేదా పంపిణీకి సంబంధించిన అంశాల గురించి పేర్కొన్నారు. చట్టంలోని పరిచ్చేధమం 2(ఏ) కింద అత్యవసర సేవల పరిధిలోకి విద్యుత్‌ను కూడా చేర్చారు. విద్యుత్‌ రంగంలోని ఇతర విషయాలతోపాటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం, విద్యుత్‌ సరఫరాని అన్ని ప్రాంతాల్లో విస్తరించటం కోసం ‘విద్యుత్‌ చట్టం–2003’లో ప్రధానంగా చర్చించారు. 

చాలామంది విద్యుత్‌ వినియోగదారులకు కానీ, లబ్ధిదారులకు కానీ, శాసనపరమైన, పాలనా పరమైన హక్కుల గురించి బాధ్యతల గురించి పెద్దగా తెలియడం లేదు. కనీసం వినియోగదారుల హక్కులు, ప్రయోజనాల కోసం ప్రత్యక్షంగా ప్రభావం చూపగల అనేక కేంద్ర రాష్ట్ర చట్టాలు, శాసనపరమైన నిబంధనలు, ఆచరణకు లోబడే ఆదేశాలు, ఉత్తర్వులు ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. 
ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా విద్యుత్‌ నియంత్రణ మండలి చర్యలు చేపడుతున్నది. అయితే, ఇంకా విద్యుత్‌ సమస్యల కోసం పనిచేసే ప్రత్యేక అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ ఉండాలని విద్యుత్‌ నియంత్రణ మండలి కోరుతున్నది. అదే విధంగా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే ప్రత్యేక ఫోరం కూడా ఏర్పాటు కావాలని నియంత్రణ మండలి సూచిస్తున్నది. ఫోరం ఆధ్వర్యంలో విద్యుత్‌ సంస్థ అధికారులను, వినియోగదారులను సమన్వయపరుస్తూ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నది.

సమస్య తలెత్తితే..
విద్యుత్‌ సంబంధ సమస్యలు, వాటి పరిష్కారాల కోసం వినియోగదారులకు ఉండే హక్కులు, శాఖాపరమైన నిబంధనల గురించి వినియోగదారులు తెలుసుకోవాలి. 
విద్యుత్‌ పంపిణీ, రిటైల్‌ సరఫరాకు సంబందించి విద్యుత్‌ నియంత్రణ మండలి కొన్ని షరతులు, నిబంధనలు విధించింది. మండలి చట్టం సెక్షన్‌–14లో వినియోగదారుల సమస్యల గురించి వివరించారు. 
విద్యుత్‌ సరఫరా ఆగిపోయినప్పుడు, లేదా, అంతరాయం కలిగినప్పుడు, నిర్ణీత సమయాల్లో విద్యుత్‌ సరఫరాని నిలిపివేసినప్పుడు, లో–వోల్టేజీలో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పడు, కొత్త కనెక్షన్‌ కోరినప్పుడు, పరికరాలు మార్చడం కానీ, వేరే స్థలంలో అమర్చడం అవసరమైనప్పుడు, మీటరు లోపాలపై ఫిర్యాదులు, బిల్లింగ్‌ ఫిర్యాదులు, సరఫరా సర్వీసు కనెక్షన్‌ తొలగించడం, లేదా తిరిగి ఇవ్వడం లేదా తాత్కాలికంగా నిలిపివేయడం తదితర సమస్యలు పరిష్కారం కాని సమయంలో ఫోరం లేదా విద్యుత్‌ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించి పరిష్కారం పొందవచ్చని నియంత్రణ మండలి చట్టం చెబుతున్నది. 
వినియోగదారుని హక్కుల గురించి, సాధారణ షరతులు, నిబంధనల గురించి, ఇందులోని సెక్షన్‌ 14.8, 14.9లో పేర్కొన్నారు. విద్యుత్‌ సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం వినియోగదారుల ఫోరం, ప్రత్యేక అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ ఉండాలని ఈ సెక్షన్‌ చెబుతోంది. కాగా ప్రకాశం జిల్లాలో విద్యుత్‌ వినియోగదారుల ఫోరం కానీ, అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయలేదు. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కానీ జిల్లా స్థాయి ఫోరంలు, అంబుడ్స్‌మన్‌లు ఇచ్చిన తీర్పులను పరిశీలించడానికి మాత్రం రాష్ట్ర స్థాయిలో విద్యుత్‌ అంబుడ్స్‌మన్‌ పనిచేస్తోంది. 
విద్యుత్‌కు సంబంధించిన సేవాలోపంపై ‘వినియోగదారుల రక్షణ చట్టం–1986’ కింద వినియోగదారుల ఫోరంలో కానీ, జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార ఫోరంలో కానీ పరిష్కారం పొందవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top