ప్రజా సంకల్ప జాతర

AP CM YS Jagan Implementing Navaratnalu For All Categories  - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: ఎన్నో ఆశలు.. మరెన్నో సమస్యలు.. ఇంకెన్నో వినతులు.. విన్నారు.. నేనున్నా అన్నారు.. భరోసా ఇచ్చారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇంకేముంది ప్రజలే గెలిపించుకున్నారు. పగ్గాలు చేపట్టిందే తడవుగా నవోదయానికి నాందిగా నవరత్న మాలికలను అందజేసే పనిలో నిమిషం ఖాళీ లేకుండా ముందుకు సాగిపోతున్నారు. మమ్మల్ని వదిలేశారు అనే మాట లేకుండా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతౌల్యం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు. గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్వయంగా భూమిని సాగు చేస్తున్న రైతు ఏ మేరకు లబ్ధి పొందుతున్నాడో.. అదే స్థాయిలో కౌలు రైతుకూ నేనున్నా అంటూ భరోసా ఇచ్చి చేతల్లోనూ రైతు బాంధవుడని అనిపించుకున్నారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి మొదలుకొని ధరల స్థిరీకరణ వరకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అలాగే ఆశా కార్యకర్తల వేతనాల పెంపుతో ఆయా వర్గాలు ఎంతో హుందాగా బతికేందుకు ఆసరా కల్పించారు.

అంగన్‌వాడీలు, మినీ అంగన్‌వాడీలు రూ.వెయ్యి పెంచడంతో వారి ఆనందానికి అవధులు లేవు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు మానసిక స్థైర్యం కల్పించారు. ఇక ఆక్వా రంగం అభివృద్ధికి విద్యుత్‌ చార్జీల తగ్గింపు, ఏజెన్సీ ప్రాంతాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ నిర్ణయాల పట్ల ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అలాగే ఆలయ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించే నిర్ణయం భగవంతుడి ముందు అంతా సమానమని చెప్పకనే చెప్తూ వివక్షకు తావులేని ప్ర భుత్వం తమదని చాటి చెప్పారు. ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న మద్యపానాన్ని దశలవారీగా తగ్గించే విధంగా మొదట బెల్టు దుకాణాల పైనా.. తరువాత మద్యం దుకాణాల తగ్గింపుపైనా చకచకా నిర్ణయాలు తీసుకుని అక్కచెల్లెమ్మల చేత ఇది కదా జగనన్న ప్రభుత్వం అంటే అనిపించేలా సాగిపోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

అంగన్‌వాడీల్లో ఆనందోత్సాహాలు
కాకినాడ సిటీ: జిల్లాలోని అంగన్‌వాడీలకు జీతాల పెంపు ప్రతిపాదన కేబినెట్‌ ఆమోదం పొందడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. చిరుద్యోగులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యలను ఆయా వర్గాలు అభినందిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,545 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 5,113 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 432 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు ఉన్నారు. 5,113 మంది అంగన్‌వాడీ హెల్పర్లు (ఆయాలు) ఉన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తకు గతంలో రూ.10,500 వేతనం ఉండగా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.1000 అదనంగా పెంచడంతో వీరికి వేతనం రూ.11,500 పెరిగింది. ఆయాకు గతంలో రూ.6 వేల వేతనం ఉంటే ఇప్పుడు రూ.1000 పెంచడంతో వేతనం రూ.7 వేలు అయ్యింది.  తాజా వేతనాలు జూలై నెల నుంచే అమలులోకి వస్తున్నాయి. ఈ మేరకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో జిల్లాలో సుమారు 11 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ కార్యకర్తలకు నెలకు రూ.1.1 కోటి వేతనాలు అదనంగా చెల్లించనున్నారు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. 

గ్రామాల్లో కొలువుల జాతరే
బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోను పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో మమేకమై, రాష్ట్రంలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, గ్రామాల్లోని సమస్యలు తెలుసుకొన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక్కో గ్రామంలో పదిమందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 1072 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 24,440 మంది గ్రామ వలంటీర్‌ పోస్టులు, 12,700కు పైగా గ్రామ సచివాలయాల్లో పోస్టులు మంజూరు కానున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి అన్నమాట ప్రకారం ఆగస్టు 15 నాటికి వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమించి అక్టోబర్‌ రెండు నుంచి గ్రామ సచివాలయాలకు ఊపిరిపోయడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు.

గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక్కో గ్రామానికి పది మందిని ఉద్యోగాల్లో నియమించడం, ప్రతి కుటుంబానికి ఒక వలంటీర్‌ను నియమించడం వల్ల గ్రామ ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్‌ సెంటర్‌కు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా మీ సమస్యని సంబంధిత అధికారులకు తెలియజేస్తాం అనేవారు కానీ సమస్యలు మాత్రం పరిష్కారమయ్యేవి కాదు. ఇప్పడు అలా కాకుండా సీఎం కాల్‌సెంటర్‌కు వచ్చిన కాల్స్‌ నేరుగా వలంటీర్లకు రావడం, వాటిని 72 గంటల్లో పరిష్కరించే విధానమే ఈ గ్రామ సచివాలయాల లక్ష్యం. తద్వారా పల్లెలు దేశాభివృద్ధికి పట్టుగొమ్మలుగా తయారుకాగలవు. 

గిరిజనులకు వరం ఉచిత విద్యుత్‌
రంపచోడవరం: ఆదివాసీలకు నెలకు 200 యూనిట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ ప్రకటించడంపై ఏజెన్సీ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ బిల్లులు భారంగా మారిన తరుణంలో 200 యూనిట్ల వరకు గిరిజనులు ఉచితంగా విద్యుత్‌ వినియోగించుకోవచ్చని ప్రభుత్వం శుక్రవారం శాసన సభలో ప్రకటించింది. దీంతో విద్యుత్‌ బిల్లుల కోసం వినియోగించే డబ్బులు తమ ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 37,119 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. అలాగే చింతూరు ఐటీడీఏ పరిధిలో మరో 22 వేల మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. పాదయాత్ర ద్వారా గిరిజన పల్లెల్లో సమస్యలు తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టాక గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

గిరిజనుల కష్టాలు తెలుసుకుని..
గ్రామాల్లో గిరిజనుల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి జగన్‌ గిరిజనులకు విద్యుత్‌ బిల్లులో 200 యూనిట్ల వరకూ ఉచితం ప్రకటించడం ఆనందంగా ఉంది. అరకొర ఆదాయంతో విద్యుత్‌ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న మాకు ప్రభుత్వ ప్రకటన వరంగా మారింది.
–బందం విజయలక్ష్మి , వీఆర్‌ పురం

మద్యం.. పరిమితం 
మండపేట: దశల వారీ మద్యం నిషేధం అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే బెల్టు షాపులు రద్దు చేయగా, అక్టోబరు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపుల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న షాపుల్లో 25 శాతం రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 137 మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. నిబంధనలు పటిష్టంగా అమలు చేయడం ద్వారా విక్రయాలు భారీగా తగ్గనున్నాయి. జిల్లాలో 546 మద్యం షాపులు ఉండగా, 45 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. రోజుకు రూ.6.83 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా గత ప్రభుత్వం జిల్లాలో మద్యాన్ని ఏరులై పారించింది.

2015 నాటికి జిల్లాలో 54 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 480 ప్రైవేటు దుకాణాలు ఉండగా విక్రయాలు పెంచుకునేందుకు ప్రభుత్వ దుకాణా లను రద్దుచేసి ప్రైవేట్‌ పరం చేసింది. గుడి, బడి పట్టించుకోకుండా ఎక్కడపడితే అక్కడ దుకాణాలు వెలిశాయి. లిఫ్టింగ్‌ను తెరపైకి తెచ్చి బెల్టుషాపుల ఏర్పాటులో వ్యాపారులకు వెసులుబాటు ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్ర హైవేలకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలోకి తొక్కింది. ఈ హైవేలను మున్సిపల్‌ డెవలప్‌మెంట్‌ రోడ్డు (ఎండీఆర్‌)ల పరిధిలోకి తీసుకువచ్చి హైవేలలో యథేచ్ఛగా మద్యం విక్రయించుకునే అవకాశం కల్పించింది గత ప్రభుత్వం. 

దశలవారీ నిషేధం దిశగా అడుగులు 
సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే దశలవారీగా మద్య నిషేధం హామీపై తొలి అడుగువేశారు జగన్‌. బెల్టు షాపు తీయకుంటే మద్యం దుకాణం లైసెన్సు రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అక్టోబర్‌ నుంచి ప్రభుత్వ అధీనంలోనే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ ప్రస్తుత షాపుల లైసెన్సును పొడిగించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలపై అధ్యయనం చేసిన ప్రత్యేక బృందాలు ఇచ్చిన నివేదికలపై గురువారం జరిగిన కేబినెట్‌ భేటీలో చర్చించారు.

జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు దూరంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం వల్ల బెల్టు షాపులు ఉండవు. నిర్ణీత వేళల్లోనే దుకాణం తెరిచి ఉంచడంతో విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలకు బ్రేక్‌ పడుతుంది. దీంతో మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పలువురు అంటున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top