వాజ్‌పేయి ప్రభుత్వాన్ని నడిపింది నేనే!

AP Assembly pays rich tributes to Atal Bihari Vajpayee - Sakshi

అసెంబ్లీలో నివాళి సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్య

ఉన్నత విలువలు కలిగిన గొప్ప రాజనీతిజ్ఞుడని కితాబు

సాక్షి, అమరావతి: రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన గొప్ప రాజనీతిజ్ఞుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని సీఎం చంద్రబాబు కొనియాడారు. మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఏపీ శాసనసభ గురువారం ఘనంగా నివాళులర్పించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై  సీఎం చంద్రబాబు చర్చ ప్రారంభించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రి పదవులు చేపట్టకుండా ప్రభుత్వాన్ని వెనుక ఉండి నడిపిన ఘనత తనదేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అలెగ్జాండర్‌ను ఖరారు చేశారని, ఖరారు చేసిన తర్వాత తనకు వాజపేయి ఫోన్‌లో ఆ విషయం చెప్పారన్నారు.

అయితే తాను మాత్రం ఈ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించానని, ఆయన రెండో రోజు  ఫోన్‌ చేసి అభ్యర్ధిగా ఎవరిని ప్రతిపాదిస్తున్నారని అడిగారన్నారు. తాను అబ్దుల్‌ కలాంను సూచించడంతోనే ఆయనకు రాష్ట్రపతిగా అవకాశం దక్కిందన్నారు. ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, మైక్రో ఇరిగేషన్, మౌలిక సదుపాయాల కల్పన, నదుల అనుసంధానం తదితర అంశాల్లో వాజ్‌పేయికి తన వంతు సలహాలను అందించానన్నారు.

హైదరాబాద్‌లో 40 పడకల ఆస్పత్రిగా బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించింది వాజ్‌పేయి అని స్పీకర్‌ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. సంతాప తీర్మానంపై జరిగిన చర్చలో మంత్రి గంటా శ్రీనివాస్, బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్‌ రాజు, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు తదితరులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.

అన్న క్యాంటీన్లపై స్వల్ప కాలిక చర్చ
అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు ఇవ్వాలని, ఇచ్చిన వారికి తగిన ప్రచారం కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. శాసనసభలో అన్న క్యాంటీన్లపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల నిర్వహణలో అంతా భాగస్వామ్యం వహించాలని కోరారు.

ఈ ఏడాదిలోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తొలి దశలో 300 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. క్యాంటీన్ల ఏర్పాటుకు అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేశామని, కేఎఫ్‌సీ, మెక్‌ డోనాల్డ్‌ తదితర కంపెనీలు నిర్వహిస్తున్న ఔట్‌లెట్లను పరిశీలించి వాటి మాదిరిగానే అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికి అన్న క్యాంటీన్లలో మొత్తం 34 లక్షల మంది భోజనం చేశారన్నారు. అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్ధలాలు అవసరమైతే, ఆయా జిల్లాల కలెక్టర్లు స్ధలాల్ని అప్పగించేలా ఆదేశాలిచ్చామన్నారు.  

రేవంత్‌ అప్పుడే రాజీనామా చేయాల్సింది   
‘‘రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు రాజీనామా చేశాడు.. తెలంగాణ అసెంబ్లీ రద్దు అవుతున్న సమయంలో ఇప్పుడు రాజీనామా చేసి లాభమేమిటి? ఆయన ఎప్పుడేమి చేస్తారో అర్థంకాదు. ఇంతకు ముందు కూడా ఇలా చేసే గందరగోళంలో పడ్డారు.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణలోని కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గురువారం రాజీనామా చేశారన్న విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా చంద్రబాబు పై విధంగా వ్యాఖ్యానించారు.

విశేషమేమంటే గతంలో కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రేవంత్‌రెడ్డి ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను చంద్రబాబుకు ఇచ్చానని, ఆయనే స్పీకర్‌కు పంపిస్తారని అప్పట్లో మీడియాకు చెప్పారు. రేవంత్‌రెడ్డి పేర్కొన్న అంశాలపై మీడియా అడిగినప్పుడు సీఎం దాటవేశారు. అప్పట్లో రేవంత్‌రెడ్డి రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు అసలు సమర్పించలేదని, కేవలం రాజీనామా చేసినట్లు నాటకమాడారని, ఇప్పుడీ విషయం తెలియడంతో అసెంబ్లీ లాబీల్లో టీడీపీ నేతలు అవాక్కయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top