ఉలిక్కిపడ్డ ‘బురిడీ బాబు’

Annam Satish Attempt to do dharna before Sakshi offices

  బ్యాంకులకు టోపీ పెట్టిన అన్నం సతీష్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

  తప్పును కప్పిపుచ్చుకోడానికి టీడీపీ ఎమ్మెల్సీ విశ్వప్రయత్నాలు

  సాక్షి కార్యాలయాల ముందు ధర్నాకు యత్నం

  టీడీపీ కార్యకర్తలను గుంటూరుకు తరలించే ప్రయత్నం

  చేబ్రోలు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయింపు

  సాక్షి కార్యాలయాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు

సాక్షి, గుంటూరు/గుంటూరు రూరల్‌/చేబ్రోలు/కర్లపాలెం: టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ బ్యాంకును బురిడీ కొట్టించిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం (23–12–2018)న  ‘టీడీపీ బ్యాచ్‌లో మరో బురిడీ బాబు’ శీర్షికతో ప్రచురితమైన కథనంలో అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ప్రభుత్వ భూములను తనఖా పెట్టి బ్యాంకులను బురిడీ కొట్టించి కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని సాక్షి వివరించింది. దీంతో అధికార పార్టీలో అలజడి మొదలైంది. తన వ్యవహారం వెలుగులోకి రావడంతో అన్నం సతీష్‌ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తప్పును ఎలా కప్పిపుచ్చుకోవాలా అని అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆదివారం మధ్యాహ్నం వరకు తర్జనభర్జన పడ్డారు. అప్పటి వరకూ పార్టీ పెద్దలతో సంప్రదింపులు కొనసాగించారు.  ఆ తర్వాత అన్నం సతీష్‌ కొత్త డ్రామాకు తెరలేపారు.

సాక్షిలో వచ్చిన కథనం అవాస్తవమని ఖండించడానికి ప్రయత్నించారు. సాక్షి కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలోని టీడీపీ నేతలకు ఫోన్‌ చేసి నాయకులు, కార్యకర్తలను సమీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఎవ్వరూ స్పందించకపోవడంతో చేసేది లేక ఆయన సొంత నియోజకవర్గం బాపట్ల నుంచి టీడీపీ కార్యకర్తలు వాహనాల్లో గుంటూరు అంకిరెడ్డిపాలెంలోని సాక్షి యూనిట్, అరండల్‌పేట మూడో లైన్‌లోని సిటీ కార్యాలయాలకు బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అన్నం అనుచరులను మధ్యలోనే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎమ్మెల్సీ అనుచరులు, టీడీపీ కార్యకర్తలను పోలీసులు నిలువరించారు.  

రాస్తారోకోతో ప్రజలకు ఇబ్బందులు...
చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద అన్నం సతీష్‌ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి హడావుడి చేశారు. రాస్తారోకో పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించారు. వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో ప్రయాణికులు అన్నం సతీష్‌ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు సాక్షి కార్యాలయాల వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంకిరెడ్డిపాలెం, అరండల్‌పేటల్లో కార్యాలయాల వద్ద అరండల్‌పేట, నల్లపాడు సీఐలు శ్రీనివాసరావు, బాలమురళి ఆధ్వర్యంలో సివిల్, స్పెషల్‌ పార్టీ పోలీసులతో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ బందోబస్తు నిర్వహించారు. కాగా, తమ ఇష్టపూర్వకంగానే భూములు ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌కు అమ్ముకున్నామని గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామ రైతులు తెలిపారు. కర్లపాలెం టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ కన్వీనర్‌ నక్కల వెంకటస్వామి ఆధ్వర్యంలో రైతులు మీడియాతో మాట్లాడారు. తమకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయని, కంపెనీ ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే భూములు విక్రయించామని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top