ఆంధ్రా యూనివర్సిటీలో దశాబ్ధాలుగా ఉన్న భారీ వృక్షాలు హుదూద్ దెబ్బకు నేలకొరిగాయి. పరిపాలనా భవనం, ఆర్ట్స్ కళాశాల, స్టేట్‌బ్యాంక్, రిజిస్ట్రార్ నివాసం, బోటనీ విభాగం,
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో దశాబ్ధాలుగా ఉన్న భారీ వృక్షాలు హుదూద్ దెబ్బకు నేలకొరిగాయి. పరిపాలనా భవనం, ఆర్ట్స్ కళాశాల, స్టేట్‌బ్యాంక్, రిజిస్ట్రార్ నివాసం, బోటనీ విభాగం, ఎకనామిక్స్ భవనం తదితర ప్రాంతాల్లోని పెద్ద వృక్షాలు కొన్ని పెకలించుకుపోయాయి. విద్య పరిశోధకుల వసతిగృహంలో ఉన్న భారీ మామిడి చెట్టు కూలిపోయింది. విద్యుత్ స్తంభాలు, దీపాలు నేలరాలాయి. భవనాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు దెబ్బతిన్నాయి. వర్సిటీకి రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు భావిస్తున్నారు. హుదూద్ తీవ్రతకు దెబ్బతిన్న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖ ఎంపీ హరిబాబు సోమవారం పరిశీలించారు.
ఏయూకు రెండు వారాలు సెలవులు
ఆంధ్రా యూనివర్సిటీకి రెండు వారాలు సెలవులిస్తున్నట్టు వీసీ జి.ఎస్.ఎన్.రాజు ప్రకటించారు. వర్సిటీ ఆవరణలో కూలిన చెట్లను తొలగించి, పరిస్థితి చక్కదిద్దేందుకు రెండు వారాలు పట్టే అవకాశం ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి జరగాల్సిన మిడ్ టర్మ్ పరీక్షలను వాయిదా వేశారు. తుపాను కారణంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సోమవారం జరగాల్సిన ఓపెన్ స్కూల్ పరీక్షల్ని వాయిదా వేసినట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ రీజనల్ డెరైక్టర్ అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తారు.