జేసీ దుర్భాషలపై ఖాకీల మౌనవేదన!

Anantapur Police Mum On JC Brothers Comments - Sakshi

పోలీసులను కొజ్జాలుగా సంభోదించిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

గతంలోనూ తాడిపత్రి ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల దుర్భాషలు

స్పందించకుండా మౌనం దాల్చిన ఖాకీలు

జేసీ వ్యాఖ్యలపై పోలీసు శాఖలో తీవ్ర చర్చ

ఇప్పుడు నిర్లిప్తత ప్రదర్శిస్తే ప్రతి ఒక్కరూ పోలీసులపై స్వారీ చేస్తారని ఆందోళన

‘పోలీసులా? కొజ్జా నా ....లా?
ఏ జాతికి సంబంధించిన వాళ్లు వీళ్లు’

ఈనెల16న  పోలీసులపై ఎంపీ జేసీ వ్యాఖ్యలు
‘నీయబ్బ చేతగాని నా ...లు..
మీరు కనపడితే.. (రాయలేని భాష)’
ఈనెల 17న తాడిపత్రి డీఎస్పీ విజయ్‌కుమార్‌పై ఎంపీ జేసీ
‘మీకు... దమ్ములేదా? చేతకాకపోతే సెలవులో వెళ్లిపోండి’
2017 డిసెంబర్‌ 21న తాడిపత్రి సీఐపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు
‘మీ వద్ద లాఠీలు ఉంటే.. మా వద్ద కట్టెలు ఉన్నాయి..
పది నిమిషాలు సమయం ఇస్తున్నాం..
తర్వాత ఏం జరుగుతుందో మాకే తెలీదు’

2017 డిసెంబర్‌లో సీఐపై జేసీ బ్రదర్స్‌ అనుచరుడు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జిలాన్‌ చేసిన వ్యాఖ్యలు
‘ఎమ్మెల్యే వస్తే పరిస్థితి చేదాటిపోతుంది,
10 నిమిషాలే సమయం ఇస్తున్నాం. ఆలోచించుకోండి’

అదే రోజు జేసీ పీఏ రవీంద్రారెడ్డి పోలీసులకు అల్టిమేటం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇవే కాదు.. పత్రికల్లో రాయలేని దుర్భాషలు వీరి నోటి నుంచి వచ్చాయి. ఏకంగా పోలీసుల ఆత్మాభిమానం దెబ్బతినేలా, విధినిర్వహణలో నైతిక స్థైర్యం కోల్పోయేలా మాట్లాడినా పోలీసులు మాత్రం అచేతనంగా వారి ‘దుర్భాషలు’ మౌనంగా వినడం మినహా ఎదిరించిన సందర్భం లేదు. సీఐ, డీఎస్పీ స్థాయి వ్యక్తులను, ఏకంగా పోలీసు శాఖను అనరాని మాటలు అంటే, ఉన్నతాధికారులు స్పందించి వారిపై కేసు నమోదు చేసి పోలీసు శాఖలో ఆత్మస్థైర్యం నింపే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు అధికారపార్టీ ఎమ్మెల్యే, ఎంపీ. అంటే రాజ్యంగంలో అధికార పార్టీకి, విపక్ష పార్టీకి, సాధారణ ప్రజలకు వేర్వేరు చట్టాలు, సెక్షన్లు ఉంటాయా? అనేది పోలీసులే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి.

తాడిపత్రి పేరు విన్నా, అక్కడి ప్రజాప్రతినిధుల ప్రస్తావన చేసినా పోలీసుల్లో నిర్లిప్తత ఆవహిస్తోంది. అది ప్రత్యేక సామ్రాజ్యంగా భావిస్తున్నారు. వీరే కాదు.. మునిసిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్‌తో పాటు ఏ అధికారి అయినా అక్కడి పెద్దమనుషులకు ‘జీహుజూర్‌’ అనాల్సిందే! లేదంటే అక్కడి నుంచి బదిలీపై వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. నాగరికత పెరిగి, చట్టాలపై ప్రజల్లో చైతన్యం వచ్చిన ఈ రోజుల్లో ఇలాంటి ప్రాంతాలు.. ఇలాంటి వ్యక్తులు ఉండటం.. వీరి దూకుడుకు పోలీసులు కళ్లెం వేయలేకపోవడం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఆశ్రమం ఘటనలో ఊగిపోయిన జేసీ
తాడిపత్రిలో ప్రభోదానంద ఆశ్రమంలో చెలరేగిన ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఒంటికాలిపై లేచి నోటికి ఎంతమాట వస్తే అంత అనేశారు. పోలీసులను కొజ్జానాకొడుకులు, చేతిగాని నాకొడుకులు అని దూషించినా పోలీసు ఉన్నతాధికారులెవరూ నోరుమెదపలేదు. ఇవే వ్యాఖ్యలు జేసీ బ్రదర్స్‌ కాకుండా విపక్ష పార్టీకి చెందిన నేతలో.. సామాన్య పౌరులో చేస్తే వారి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోచ్చు. మేయర్‌ స్వరూపపై సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి అసభ్యకర పోస్టింగులు పెట్టిన ఘటనలో మేయర్‌ ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతన్ని విడుదల చేయాలని తాడిపత్రి మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జిలాన్, జేసీ పీఏ రవీంద్రారెడ్డి స్టేషన్‌కు వెళ్లి సీఐ భాస్కర్‌రెడ్డిపై దూషణలకు దిగారు. ‘మీవద్ద లాఠీలు ఉంటే మా వద్ద కట్టెలు ఉన్నాయి’ అని పరోక్షంగా పోలీసులపై దాడి చేస్తామని బెదిరించారు. ‘మీకు 10 నిమిషాలు ఇస్తున్నా!’ అని జేసీ పీఏ సీఐలకే అల్టిమేటం ఇచ్చారు.
 
మూడు రోజులుగా పోలీసుల్లో తీవ్ర చర్చ
ఐదు జిల్లాల ఎస్పీలు, కర్నూలు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ ఉన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి ఈ ఘటనలో మొత్తం పోలీసు వ్యవస్థను టార్గెట్‌ చేసి మాట్లాడారు. అయినా వారు స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయలేదు. ఓ ప్రజాప్రతినిధి మొత్తం పోలీసు వ్యవస్థను కొజ్జాలుగా దూషిస్తే అతనిపై చర్యలు తీసుకోకపోతే, మొత్తం సిబ్బందికి ఎలాంటి సందేశాన్ని ఉన్నతాధికారులు పంపుతున్నారు అని శాఖలో చర్చ మొదలైంది. దూషణలకు దిగిన వారిని వదిలిస్తే రేపు ఎంపీ, ఎమ్మెల్యే నుంచి ఎంపీటీసీ దాకా.. ఆపై రోడ్డున వెళ్లే రౌడీషీటర్‌ దాకా అంతా ఇదే వైఖరి అవలంబిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు పరువును కాపాడి, యావత్‌ పోలీసు యంత్రాంగానికి ఆత్మస్థైర్యం కల్పించాలంటే ఈ ఘటనపై చర్చ జరిగి చర్యలు ఉండాలని ఓ డీఎస్పీ ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top