ఆగస్టు 8న అమెరికాకు | Sakshi
Sakshi News home page

ఆగస్టు 8న అమెరికాకు

Published Tue, Jun 3 2014 12:05 AM

ఆగస్టు 8న అమెరికాకు - Sakshi

  •      ఉన్నత చదువులకు కలెక్టర్
  •      ఏడాది పాటు అక్కడే
  •      కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ విదేశీ ప్రయాణం దాదాపుగా ఖరారైంది. ఆగస్టు 8న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు టికెట్ సిద్ధమైంది. ఉన్నత చదువుల కోసం ఆయన ఏడాది పాటు సెలవుపై యూఎస్ వెళ్లనున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు లభించాయి. యూఎస్‌లో యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ చేయడానికి వెళ్లనున్నారు.

    అన్ని అనుమతులు వచ్చినప్పటికీ యూనివర్సిటీలో అడ్మిషన్ తేదీ ఇంకా ఖరారు కాలేదు. టికెట్ మాత్రం ఆగస్టు 8కి బ్లాక్ చేశారు. యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ ఖరారైన వెంటనే వెళతారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు, కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కలెక్టర్ ఈ కోర్సు చేస్తున్నట్టు తెలిసింది. అప్పటి వరకు ఆయన కలెక్టర్‌గా కొనసాగుతారా? లేదా, ఆయన స్థానంలో జిల్లాకు కొత్త కలెక్టర్ వస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.

    రాష్ట్ర విభజన నేపథ్యంలో రోస్టర్ పద్ధతిన రెండు రాష్ట్రాలకు ఐఏఎస్‌ల కేటాయింపులు జరగనున్నాయి. సీమాంధ్ర జిల్లాలకు చెందిన ఐఏఎస్‌లకు ఇక్కడే పోస్టింగ్‌లు లభించనుండగా, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు క్యాడర్‌గా వచ్చిన ఐఏఎస్‌లకు రోస్టర్ ప్రకారం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నా రు. ఆ కేటాయింపులు జరిగేంత వరకు జిల్లాకు కొత్త కలెక్టర్ ఎవరన్న విషయంపై స్పష్టత రాదు. సీమాంధ్రకు చెందిన ఐఏఎస్‌లు కొంత మంది అప్పుడే విశాఖ కలెక్టర్‌గా పోస్టింగ్ కోసం ప్రయత్నాలను ప్రారంభించారు.

Advertisement
Advertisement