అమరావతికి పార్లమెంట్‌ ఆమోదం లేదు!

Amaravati not approved by Parliament - Sakshi

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదమే ఉంది

చంద్రబాబు చేసిన భూసమీకరణ పెద్ద బోగస్‌

రైతుల మెడ మీద కత్తిపెట్టి భూములు లాక్కున్నారు

ఏపీ అభివృద్ధిపై సదస్సులో వక్తలు

సాక్షి, అమరావతి :  కేంద్ర ప్రభుత్వం నియమించిన శివ రామకృష్ణన్  కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పటికీ దానికి పార్లమెంట్‌ ఆమోదం లేదని, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం మాత్రమే ఉందని పలువురు వక్తలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద నగరాన్ని నిర్మించాలనే భ్రమలో చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లూ కొట్టుమిట్టాడి.. దాని చుట్టూనే పరిభ్రమించిందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి.. చంద్రబాబు చెప్పినట్టు ఏ రైతూ సొంతంగా తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని, మెడ మీద కత్తి పెట్టి భూములు లాక్కున్నారన్నారు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌– అభివృద్ధి– సమస్యలపై ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఆంధ్రప్రదేశ్‌’ విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ముగింపు రోజైన సోమవారం అమరావతి, రాజధాని అభివృద్ధిపై సదస్సు జరిగింది.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సెస్‌ (హైదరాబాద్‌)కు చెందిన డాక్టర్‌ సి.రామచంద్రయ్య, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పురేంద్ర ప్రసాద్, వి.రాజగోపాల్, సామాజిక సేవా కార్యకర్తలు అనుమోలు గాంధీ, ఎం.శేషగిరిరావు, మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ, తదితరులు ప్రసంగించారు. చంద్రబాబు తలపెట్టిన భూసమీకరణ పెద్ద బోగస్‌ అని, సీఆర్‌డీఏ ప్రాంతంలో గత ఐదేళ్లు మిలటరీ తరహా పాలన సాగిందని శేషగిరిరావు ఆరోపించారు. చివరకు నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకున్నారన్నారు.

రాజధాని ఎక్కడ వస్తుందో ముందే చెప్పి తన అనుచరులు భూములు కొనుక్కునేలా చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేయించారని ధ్వజమెత్తారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు సీఆర్‌డీఏ పనికి వచ్చిందని, వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయని గాంధీ ఆరోపించారు. రాజధాని నిర్మాణాన్ని అవుట్‌సోర్సింగ్‌ సంస్థలకు అప్పగించడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని పురేంద్రప్రసాద్‌ చెప్పారు. ప్రతి గ్రామాన్ని పోలీసు క్యాంపుగా మార్చి ప్రజలను భయపెట్టి భూముల్ని గుంజుకున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. మాజీ ఐఎఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ మాట్లాడుతూ ప్రజలకు ఏది కావాలో దాన్నే పాలకులు చేపడితే సత్ఫలితాలు వస్తాయన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top