ఒక్క ఐడియాతో అమరావతి నిర్మిస్తున్నాం..

Amaravati is building with a unique idea says Chandrababu - Sakshi

హ్యాపీ సిటీస్‌ సదస్సులో చంద్రబాబు వెల్లడి 

రూ.8 వేల కోట్లతో చేపట్టనున్న 30 కొత్త ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో: ఒక్క ఐడియాతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. భవిష్యత్‌ తరాలు సంతోషంగా నివసించేలా, సింగపూర్‌ను మించిన నగరంలా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విజయవాడలో బుధవారం హ్యాపీ సిటీస్‌ సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. నాణ్యమైన జీవితం, ఆనందమయ నగర నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం అమరావతిని నిర్మిస్తోందని స్పష్టం చేశారు. తొలుత స్మార్ట్‌సిటీస్, మౌలిక సదుపాయాలకు సంబంధించిన రెండు అవగాహనా ఒప్పందాలను(ఎంవోయూ) రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. అర్బన్‌ అసెట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా మేనేజ్‌మెంట్‌ సిస్టం, అమరావతి రెసిడెంట్‌ కార్డులను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ నగరంగా నిర్మిస్తున్నామని, చాలా కన్సల్టెన్సీలు నగర నిర్మాణంలో సేవలు అందిస్తున్నాయని చెప్పారు. రాజధానిలో 9 సిటీలు, 25 టౌన్‌షిప్‌ల నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ, భారత్‌లో అమెరికా కాన్సూల్‌ జనరల్‌ మైఖేల్, బూటాన్‌లోని థింపూ నగర మేయర్‌ కిన్లే దోర్జి, ఇంధన కార్యదర్శి అజైన్‌ జైన్, సీఆర్‌డీఏ కబిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు ప్రసంగించారు. వేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో రూ.8 వేల కోట్లతో చేపట్టనున్న 30 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 

140 నదులను అనుసంధానిస్తా: చంద్రబాబు 
‘ఐదేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్నా.. వచ్చే 75 రోజులు నాకోసం కష్టపడండి’ అని ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా.. ఇలా 140 నదులను అనుసంధానం చేసి రాష్ట్రంలో కరవు అనే మాట వినిపించకుండా చేస్తానని చెప్పారు. గుంటూరు జిల్లాలో 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే వైకుంఠపురం బ్యారేజీకి బుధవారం ముఖ్యమంత్రి భూమిపూజ చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.  అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న అమరావతికి, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు పోలికే లేదని పేర్కొన్నారు. వైకుంఠపురం వద్ద నీటిని నిల్వ చేసి సుందర జలాశయంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రధాని నరేంద్రమోదీని తమ్ముడిగా సంబోధించిన చంద్రబాబు... ఆయనను ఇంటికి సాగనంపుతానని వ్యాఖ్యానించారు. మోదీ వెళ్లిపోతేనే రాష్ట్రానికి హోదా దక్కుతుందన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top