ఆపదలోనూ అదృష్టం | Air bags save life | Sakshi
Sakshi News home page

ఆపదలోనూ అదృష్టం

Jun 20 2014 1:36 AM | Updated on Sep 2 2017 9:04 AM

ఆపదలోనూ అదృష్టం

ఆపదలోనూ అదృష్టం

ఆపదలోనూ అదృష్టమంటే ఇదేనేమో. గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి బాలరాజుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఆ కోవలోకే వస్తుందేమో.

  •       ప్రాణాలు కాపాడిన ఎయిర్ బ్యాగ్‌లు
  •      వెంట్రుక వాసిలో తప్పిన పెను ప్రమాదం
  •      బాలరాజుకు తప్పిన ప్రాణాపాయం
  •      సీట్ల మధ్యన ఇరుక్కుని సతీష్‌వర్మ గాయాల పాలు
  • నర్సీపట్నం : ఆపదలోనూ అదృష్టమంటే ఇదేనేమో. గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి బాలరాజుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఆ కోవలోకే వస్తుందేమో. జరిగిన ప్రమాదం తీవ్రమైనదైనా, బాలరాజు, కాంగ్రెస్ నాయకుడు సతీష్ వర్మ గాయాలతో బయిటపడడం చూస్తే ఎవరికైనా ఇదే భావం కలుగుతుంది.

    కారులోని ఎయిర్ బ్యాగ్‌లు వారి ప్రాణాలు కాపాడడంతో కీలక పాత్ర పోషించగా, చెట్లను, కరెంటు స్తంభాన్ని ఢీకొనకుండా కారు కాస్త పక్కగా పోవడంతో కూడా పెను ప్రమాదం తప్పింది. ఓ సన్నిహితుడి వివాహానికి  బుధవారం జంగారెడ్డి గూడెం వెళ్లిన బాలరాజు, డీసీసీ అధ్యక్షుడు సతీష్ వర్మ, ఇద్దరు గన్‌మెన్‌లతో కలిసి బాలరాజు కొత్తగా కొన్న మహీంద్రా కారులో రాత్రి తిరుగుపయనమయ్యారు.

    తెల్లవారు జామున మూడున్నర, నాలుగు గంటల మధ్య నాతవరం మండలం ములగపూడి, బెన్నవరంల మధ్య డ్రైవరు నిద్ర మత్తు కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు కుడిపక్కగా ఉన్న రెండు చెట్లను  రాసుకుంటూ కారు దూసుకుపోయి నిలిచిపోయింది. సంఘటన జరిగిన వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  ఎన్నికలు ముగిసిన తరువాత అధికార వాహనం అప్పగిం చిన బాలరాజు ఈ కొత్త కారు కొనుగోలు చేశా రు. ఈ కారు వల్లే ప్రాణాలు నిలిచాయని స్థాని కులు  అంటున్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని చెప్పారు.
     
    స్పెషల్ వార్డులో చికిత్స


    విశాఖపట్నం, మెడికల్:  కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి బాలరాజు విశాఖలోని కేజీహెచ్‌లో మెన్స్ స్పెషల్‌వార్డులో చికిత్స పొందుతున్నారు. సతీష్‌వర్మ, మరో గన్‌మెన్ కూడా అక్కడే చికిత్స పొందుతున్నారు. బాలరాజుకు ముఖం కుడిభాగం, ఎడమ మోచేయి, మోకాలు భాగాల్లో చర్మం తెగిపోవడంతో సుమారు 100 వరకూ కుట్లు వేసినట్లు చికిత్స నందిస్తున్న ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు. ముఖం భాగంలో ఫ్రాక్చర్లు కనపడలేదన్నారు. సతీష్ వర్మకు కాలు విరిగిపోవడంతో అత్యవసర ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్స చేసినట్టు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ బి.ఉదయ్‌కుమార్ తెలిపారు.
     
    మంత్రి గంటా పరామర్శ
     
    విశాఖపట్నం, మెడికల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలరాజును రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ఎం. శ్రీనివాసరావు గురువారం రాత్రి పరామర్శించారు. ప్రమాదానికి గురైన సంఘటన వివరాలను బాలరాజును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కేజీహెచ్ సీఎస్‌ఆర్‌ఎం ఓ బంగారయ్య, కేఎస్‌ఎల్‌జీ శాస్త్రిలను ఆదేశించారు. ప్రమాదానికి గురైన ఇద్దరు గన్‌మెన్‌లను కూడా పరామర్శించారు. బాలరాజును అరకు ఎంపీ కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు కొయ్యప్రసాదరెడ్డి, అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ నర్సింహారావు తదితరులు పరామర్శించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement