మళ్లీ వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు | Sakshi
Sakshi News home page

మళ్లీ వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు

Published Wed, Jan 1 2014 11:37 PM

Again cooking gas cylinder price hike

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి రోజువారీ జీవితాన్ని అష్టకష్టాలతో నెట్టుకొస్తున్న సగటు జీవిపై చమురు సంస్థలు కొరడా ఝుళిపించాయి. వంటగ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసి వినియోగదారుడికి చుక్కలు చూపించాయి. ఎన్నడూలేని విధంగా ధరలను పెంచడంతో ఆమ్‌ఆద్మీ గుండె గుభేల్‌మంది. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రాయితీ సిలిండర్‌పై రూ.25 పెంచగా, రాయితీ అవధి దాటిన (9సిలిండర్లు) వాటిపై ఏకంగా రూ.217 పెంచేసింది. అదేవిధంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.385కు హెచ్చించింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి.

 జిల్లాలో 52 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో గృహ అవసరాలకు వాడే గ్యాస్ కనెక్షన్లు 13.55లక్షలున్నాయి. వీటిలో నెలవారీగా 9లక్షల గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చమురు సంస్థలపై నియంత్రణ ఎత్తివేయడంతో అడ్డూ,అదుపు లేకుండా ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరల్లో వచ్చే మార్పులను సాకుగా చూపుతూ ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తున్న చమురు సంస్థలు.. తాజాగా వంటగ్యాస్‌పై ధరలను భారీగా పెంచాయి. రాయితీపై ఇచ్చే సిలిండర్ ధర రూ.25 పెంచగా, రాయితీ లేని సిలిండర్‌పై రూ.217 పెంచాయి.

 ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే తొమ్మిది రాయితీ సిలిండర్లు ఒక్కో దానిపై రూ.419 కాస్త రూ.444కు చేరింది. అదేవిధంగా 9 సిలిండర్ల తర్వాత ఇచ్చే రాయితీ లేని సిలిండర్ ధర కాస్త రూ.1109 నుంచి రూ.1326కు చేరింది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ ప్రస్తుత ధర రూ.1881 ఉండగా.. తాజా పెంపుతో ఈ ధర రూ.2266 కు పెరిగింది. పెంచిన ధరలు అతి త్వరలో అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో జిల్లాలోని వినియోగదారులపై ఏటా రూ.97.47కోట్ల భారం పడనుంది.

Advertisement
Advertisement