కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు
ఇరిగేషన్‌పై ఏపీ మంత్రి మండలి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పెరిగిన ధరల ప్రకారం నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు (కాస్ట్ కాంపెన్సేషన్) చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. జీవో నంబర్ 13 ప్రకారం కాస్ట్ కాంపెన్సేషన్ (ఖర్చు పరిహారం) నిర్ణయించేందుకు రెండు హైపవర్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ఎంత అదనంగా చెల్లించాలి, కాలపరిమితి ఎంత పెట్టాలి అనే అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతనగల హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. రూ. 100 కోట్ల లోపు ప్రాజెక్టుల విషయంలో ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఈ హైపవర్ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది.
అసంపూర్తిగా ఉన్న 41 ప్రాజెక్టులను రాబోయే ఐదేళ్లలో పూర్తి చేసేందుకు రూ.21,280 కోట్లు అవసరమవుతాయని, ఈ నిధులను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రిమండలి పేర్కొన్నట్లు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో సుదీర్ఘంగా ఆరుగంటలపాటు జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఐదేళ్లలో 41 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే 23,23,072 ఎకరాలు ప్రత్యక్షంగా సాగులోకి రావడంతోపాటు మరో మూడు లక్షల ఆయకట్టు స్థిరీకరణలోకి వస్తుందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వాలు రూ. 80 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడితే ఏపీలోనిరూ. 50 వేల కోట్ల ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ. 5,400 కోట్లు ఖర్చు చేశామని, మిగిలినది కేంద్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందన్న ఆశాభావాన్ని కేబినెట్ వ్యక్తం చేసిందన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రంలో మేజర్, మీడియం,మైనర్ చెరువులు అన్నింటినీ పటిష్టం చేసే పనిలో భాగంగా చెరువు కట్టల పునరుద్ధరణ, గండ్ల పూడ్చివేత, సప్లయి, ఫీడర్ ఛానళ్ల పూడికతీత ద్వారా నీటి సంరక్షణ చర్యలు చర్యలకు శ్రీకారం చుట్టాలని మంత్రి వర్గం నిర్ణయించిందన్నారు.
మహిళా సాధికార సంస్థ ఏర్పాటు...
రైతు సాధికార సంస్థ తరహాలో మహిళా సాధికార సంస్థ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 26 వేల గ్రామాల్లో ఉన్న 6.52 లక్షల మహిళా సంఘాల్లోని 69 లక్షల మంది సభ్యుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సెర్ప్, డ్వాక్రా, మెప్మాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి మహిళా సాధికార సంస్థ ఏర్పాటు చేస్తారు. ఇది పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తుంది. 2004లో తలసరి ఆదాయం విషయంలోనూ, మానవాభివృద్ధి సూచీలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉండగా ప్రస్తుతం తలసరి ఆదాయం విషయంలో 11వ స్థానానికి, మానవాభివృద్ధి సూచీలో 15వ స్థానానికి పడిపోయిందనే అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయన్నారు.
ప్రతిపల్లెకూ ఇంటర్నెట్ సౌకర్యం
ప్రతిపల్లెకూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం ద్వారా సాంకేతిక విప్లవం తెచ్చేందుకు రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుకు ఆమోదం. రాష్ట్రంలోని 1.30 కోట్ల ఇళ్లు ఉండగా ప్రతి ఇంటికీ సెకెనుకు 10 నుంచి 15 మెగాబైట్స్, ప్రతి పంచాయతీకి సెకనుకు ఒక జీబీ స్పీడుతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే ఈ ఫైబర్ గ్రిడ్ లక్ష్యం. ఇందుకు ప్రతి ఇంటికీ నెలకు రూ. 150 చొప్పున ఖర్చుకానుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 10 కోట్ల ప్రాథమిక పెట్టుబడి పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
కేబినెట్‌లో తీసుకున్న ఇతర ముఖ్య నిర్ణయాలు..
- సంక్రాంతి పండుగకు చంద్రన్న సంక్రాంతి ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి రూ.241.75 విలువైన పిండివంటల తయారీ వస్తువులు అందిస్తారు. 1.30 కోట్ల ఇళ్లకు ఈ ప్యాకేజీ పంపిణీ కోసం రూ. 314.06 కోట్లు ఖర్చుకానుంది.
- రాష్ట్ర ఉత్సవంగా సంక్రాంతి పండుగ నిర్వహణ. సంబరాల్లో ముగ్గుల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్స్, పశు ప్రదర్శన, గాలిపటాలు ఎగరేయడం, ఉత్తమ రైతుల పురస్కారాలు నిర్వహిస్తారు.
- రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలికలన్నీ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం నుంచి రూ. 1,400 కోట్ల నిధులను పెర్ఫార్మెన్స్ గ్రాంటు కింద ఫైనాన్స్ కమిషన్ నుంచి తీసుకురావాలి.
- అనంతపురం జిల్లాలో 60 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు 118.53 ఎకరాల భూమి కేటాయింపు. తాడిపత్రి మండలం భోగసముద్రంలో 15 మెగావాట్ల ప్రాజెక్టు కోసం గమేషా విండ్ టర్బైన్స్‌కు 32 ఎకరాలు, తలారి చెరువులో ఆర్‌ఎస్‌ఆర్ పవర్ ప్రాజెక్టుకు 35.65 ఎకరాలు, సి.కొత్తపల్లి మండలం ముష్టికోవెలలో 10 మెగావాట్ల ప్రాజెక్టు కోసం ‘రామగిరి రాయల్’కు 21.65 ఎకరాలు, ఎంఎస్ నవీన్ గ్రీన్ ఎనర్జీ (20 మెగావాట్లు)కి 29.25 ఎకరాల కేటాయింపు.
- పారిశ్రామిక విధానంపై అధ్యయనం చేసి వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించాలని నిర్ణయం.
- విద్యా ప్రమాణాల పెంపులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని నిర్ణయం
సంబంధిత వార్తలు