రూ.100కోట్లకు పైనే అవినీతి | acb rides on rto officer krishna kishore | Sakshi
Sakshi News home page

రవాణాలో అవినీతి కిశోరం

Dec 22 2017 3:16 AM | Updated on Aug 17 2018 12:56 PM

acb rides on rto officer krishna kishore - Sakshi

సాక్షి, అమరావతి/లక్ష్మీపురం (గుంటూరు)/ఒంగోలు క్రైమ్‌/నెల్లూరు (క్రైమ్‌): ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్‌ ఆర్‌టిఓగా పనిచేసి అటాచ్‌మెంట్‌పై విజయవాడ కమిషనర్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిసున్న బొల్లాపల్లి శేషాద్రి కృష్ణకిశోర్‌ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆయనపై పంజా విసిరింది. ఆయనతోపాటు ఆయన బంధువులు, బినామీల ఆస్తులపై గురువారం గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరులో కృష్ణకిశోర్‌ ఇంటితోపాటు ఆయన బినామీలుగా చెబుతున్న రవాణాశాఖ ఏజెంట్లు చెంచయ్య, ఎల్లయ్య ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు.

దాడుల్లో గుర్తించిన ఇళ్లు, స్థలాలు, పొలాలు తదితర ఆస్తుల విలువ రూ.వంద కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీఓలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకిశోర్‌ భార్య అనురాధ, కుమారుడు సత్య కమల్‌ కిషోర్, తండ్రి వెంకటేశ్వర్లు, సోదరుడు శ్రీనివాస రాంప్రసాద్‌ నివాసాల్లోనూ సోదాలు జరిగాయి. కృష్ణకిషోర్‌ తండ్రి వెంకటేశ్వర్లు గుంటూరు రవాణా శాఖలో టైపిస్ట్‌గా చేరి జూనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది 1989లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందగా.. ఆ స్థానంలో కృష్ణకిశోర్‌ 1991 జూలై 13న గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. 1997లో సీనియర్‌ అసిస్టెంట్‌గా అక్కడే పదోన్నతి పొందారు. 2010లో నెల్లూరు ఆర్టీవో కార్యాలయ ఏఓగా బదిలీ అయ్యారు. ఏఓగా, ఇన్‌చార్జి ఆర్టీవోగా నెల్లూరులో సుమారు ఆరేళ్లకుపైగా బాధ్యతలు నిర్వహించారు.  

స్థలాలే స్థలాలు...
కృష్ణకిశోర్‌కు గుంటూరు జిల్లా ఈదులపాలెంలో 400 చ.గజాలు, సత్తెనపల్లిలో 60 గజాలు, గుంటూరు స్తంభాలగరువులో 36.78, 112 గజాల స్థలాలు, తాడికొండలో 100 గజాలు, నరసరావుపేట మండలం కాకానిలో 2.4 ఎకరాలు, 9.10 ఎకరాలు, 9.66 ఎకరాలు, 2.98 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. పిట్లవారిపాలెంలో 25 సెంట్లు, కొరిటెపాడులో 175 గజాలు, గోరంట్లలో 195.5 గజాలు, వినుకొండలో 1.7 ఎకరాలు, రెండు కార్లు, మూడు ద్విచక్రవాహనాలు ఉన్నట్టు గుర్తించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో రామ్‌లీలా అపార్ట్‌మెంట్‌లో టి.అనూరాధ పేరు మీద రెండు ఫ్లాట్లు, సంతపేటలో మరో ఇంటిని గుర్తించారు. పలు ప్రాంతాల్లో 10 ఇళ్ల ప్లాట్లు, విశాఖ జిల్లా రామాపురంలో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను గుర్తించారు. 250 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి, రూ.1.37లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement