ఆధార్ నమోదు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో ఆధార్ నమోదులో జాప్యంపై రాస్తారోకోలు, ధర్నాలతో అట్టుడికిన పరిగిలో మళ్లీ ఆందోళనలు చోటు చేసుకుంటున్నా యి.
పరిగి, న్యూస్‌లైన్: ఆధార్ నమోదు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో ఆధార్ నమోదులో జాప్యంపై రాస్తారోకోలు, ధర్నాలతో అట్టుడికిన పరిగిలో మళ్లీ ఆందోళనలు చోటు చేసుకుంటున్నా యి. ఆధార్ నమోదు చేసుకొని సంవత్సరం దాటి నా కార్డులు రాకపోవడంతో మళ్లీ ఫొటోలు దిగేందు కు సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. పరిగిలో 110 శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు చెబుతుండగా ఆధార్ కేంద్రం వద్ద రోజూ వందల సంఖ్యలో నమోదుకు బారులు తీరుతుండటం గమనార్హం. ప్రస్తుతం పరిగిలో ఒకే కంప్యూటర్‌తో ఆధా ర్ నమోదు చేస్తుండటం, తరచూ కరెంట్ పోతుండటంతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీంతో విసిగిన ప్రజలు మంగళవారం రోడ్డెక్కారు. పరిగి - వికారాబాద్ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సముదాయించేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అస్తవ్యస్తంగా ప్రక్రియ..
ఆధార్ నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైం ది. నమోదు చేసుకున్న ఆరు నెలలకు గానీ కార్డులు రావటంలేదు. వచ్చాక పోస్టాఫీస్ సిబ్బంది అందజేయటంలోనూ ఆలస్యం చేస్తున్నారు. కేంద్రాల సిబ్బంది ఆధార్ నమోదుకు రూ.100-రూ.500 వరకూ తీసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫొటోలు దిగిన వారికి రసీదులు ఇవ్వ డం ఇవ్వడం లేదని, ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదన్న విమర్శలున్నాయి. పరిగి మండలంలోని బాబాపూర్, రూప్‌ఖాన్‌పేట్ తదితర గ్రామాలకు చెందిన వారి ఆధార్ వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో మళ్లీ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.