గందరగోళంగానగదు బదిలీ | Aadhaar connectedness Dilemma | Sakshi
Sakshi News home page

గందరగోళంగానగదు బదిలీ

Oct 1 2013 2:14 AM | Updated on Sep 2 2018 5:45 PM

నగదు బదిలీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. గ్యాస్ కనెక్షన్‌తో ఆధార్ అనుసంధాన ప్రక్రియపై సందిగ్ధం నెలకొంది. పథకాలను ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి చేయడం సరికాదంటూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది.

విశాఖ రూరల్, న్యూస్‌లైన్: నగదు బదిలీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. గ్యాస్ కనెక్షన్‌తో ఆధార్ అనుసంధాన ప్రక్రియపై సందిగ్ధం నెలకొంది. పథకాలను ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి చేయడం సరికాదంటూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో నగదు బదిలీ పథకం గందరగోళంగా మారింది. సుప్రీం తీర్పు వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో పథకం వర్తింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం నుంచి గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆధార్‌తో బ్యాంకు అకౌంట్, గ్యాస్ కనెక్షన్ వివరాల నమోదును వేగవంతంగా చేపడుతున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే సబ్సిడీ గ్యాస్ రాదనే భయంతో చాలా మంది గ్యాస్ డీలర్ల వద్ద క్యూలు కడుతున్నారు. హెచ్‌పీసీఎల్, ఐఓసీ, బీపీసీలకు సంబంధించి విశాఖలో 38 మంది డీలర్లు ఉన్నారు. వీరి పరిధిలో 6,41,368 కనెక్షన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో 3,03,326 ఉన్నాయి. వీరందరికీ నగదు బదిలీ పథకాన్ని వర్తింప చేయడానికి ఏర్పాట్లు చేశారు.

అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్‌ను అనుసంధానం చేసుకున్న వారి ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ డబ్బు జమవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ప్రక్రియకు బ్రేక్ పడినట్టు అధికారులు చెబుతున్నారు.
 
22 శాతం అనుసంధానం

 జిల్లాలో నగదు బదిలీ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 22 శాతం మంది ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్‌ను అనుసంధానం చేసుకున్నారు. ఇప్పటికీ చాలా మంది బ్యాంకు అకౌంట్లు లేని వారు, ఆధార్ లేని వారు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఆధార్, అకౌంట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు.

 జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఆధార్ నమోదు 93 శాతం పూర్తయింది. జిల్లాలో జనాభా 42,88,113 కాగా, ఇందులో 39,99,142 మందికి ఆధార్ నమోదు పూర్తయింది. 2,90,888 తిరస్కరణకు గురయ్యాయి. 29,72,127 మంది కార్డులు సిద్ధం కాగా, 8,36,132 మందికి సంబంధించి ఇంకా తయారు కావాల్సి ఉంది. ఇంకా 4,52,949 మంది వివరాలు నమోదు చేయాల్సి ఉంది. జిల్లాలో నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆధార్ కార్డుల జారీ కూడా వేగవంతంగా జరుగుతోంది.

 వారంలోగా స్పష్టత

 నగదు బదిలీ పథకంపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు తుది చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. కానీ యథావిధిగా ఆధార్‌తో అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వినియోగదారులకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆధార్‌పై కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. త్వరలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు దీనిపై స్పష్టత వస్తుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement