ఏమైందో..ఏమో?
తల్లి తన ఇద్దరి బిడ్డలతో పాటు తనపైనా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ముగ్గురూ సజీవ దహనమయ్యారు
♦ ఇద్దరి పిల్లలతో పాటు తనపైనా కిరోసిన్ పోసుకున్న తల్లి
♦ తలుపులేసి ఉన్న ఇంట్లో క్షణాల్లో ముగ్గురూ సజీవ దహనం
♦ ఇలా..ఎందుకు జరిగిందో తెలియదంటున్న భర్త, మామ
♦ దర్శి మండలం తూర్పుచౌటపాలెంలో ఘటన..
ఆ తల్లికి వచ్చిన కష్టం ఏమిటో తెలియదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు బిడ్డలను తనతో పాటు ఈ లోకం నుంచి తీసుకెళ్లాలన్న కఠిన నిర్ణయం తీసుకుంది. పాల కోసం ఏడుస్తున్న పాపను.. స్కూల్‌కు సిద్ధమవుతున్న కొడుకును నిలువరించింది. తల్లి హడావుడి ఆ పసిహృదయాలకు అర్థం కాలేదు పాపం..! ఇంటికి రెండు వైపులా తలుపులేసి ఇద్దరి బిడ్డలతో పాటు తనపైనా కిరోసిన్ చల్లుకుని నిప్పంటించుకుంది. అంతే క్షణాల్లో ముగ్గురి ప్రాణాలూ గాలిలో కలిశాయి.
దర్శి : ఓ తల్లి తన ఇద్దరి బిడ్డలతో పాటు తనపైనా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ముగ్గురూ సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మండలంలోని తూర్పుచౌటపాలెంలో గురువారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మూల వెంకటేశ్వరరెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డికి పొదిలి మండలం గొళ్లపల్లి పంచాయతీ సింగారెడ్డిపల్లికి చెందిన తన మేనమామ సింగారెడ్డి వీరారెడ్డి కుమార్తె సరస్వతితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం 6 గంటలకే తండ్రీకొడుకు వెంకటేశ్వరరెడ్డి, రాజశేఖరరెడ్డిలు పొలానికి వెళ్లారు.
8 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. అప్రమత్తమై కేకలు వేయగా ఎవరూ పలకలేదు. పొగలు మరింత ఎక్కువ వస్తుండడంతో స్థానికులు దగ్గరకు వెళ్లి తలుపులు నె ట్టి చూడగా ఇంటి వెనుక, ముందు రెండు వైపులా గడియలు పెట్టి ఉన్నాయి. స్థానికులు మరింతమంది పోగై తలుపులు బద్దలు కొట్టి చూడగా రాజశేఖర్‌రెడ్డి భార్య సరస్వతి(25), కుమారుడు జగన్ (4), కుమార్తె (8నెలలు) ముగ్గురూ మంటల్లో కాలిపోతూ కనిపించారు.
వెంటనే గోనె సంచులతో మంటలు ఆర్పివేశారు. అప్పటికే ముగ్గురూ సజీవదహనమయ్యారు. తల్లితో పాటు ఆమె ఒడిలో ఉన్న 8 నెలల పాప, ఆ పక్కనే 4 ఏళ్ల కుమారుడు జగన్ మృతదేహాలను చూసి బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కిరోసిన్ డబ్బా పక్కనే ఉండటంతో పిల్లలతో పాటు తనపై కూడా సరస్వతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందని స్థానికులు చెబుతున్నారు.
కుటుంబ సభ్యులే చంపారేమో..?
సమాచారం అందుకున్న డీఎస్పీ వి.శ్రీరాంబాబు, ఎస్సై సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సరస్వతి తల్లిదండ్రులు, అత్తమామలను విడివిడిగా విచారించారు. సరస్వతి తండ్రి మాత్రం తమ కుమార్తెను ఆమె కుటుంబ సభ్యులే ఏమైనా చేశారేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని డీఎస్పీ శ్రీరాంబాబు తెలిపారు. సర్వస్వతి మామ వెంకటేశ్వరరెడ్డి, అత్త సాయమ్మ, భర్త రాజశేఖర్‌రెడ్డిలను పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
కుప్పకూలిన భర్త
పొలంలో ఉన్న భర్త, మామ, సరస్వతి తల్లిదండ్రులకు బంధువులు సమాచారం అందించారు. భార్య, పిల్లలు సజీవదహనం కావడం చూసిన రాజశేఖర్‌రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఎందుకు ఇలా జరిగిందో అర్థంకావడం లేదని సరస్వతి మామ వెంకటేశ్వరరెడ్డి కన్నీటిపర్యంతమయ్యాడు. బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బాల్యం మేనత్త ఇంట్లోనే..
సరస్వతి చిన్న తనంలో 8,9,10వ తరగతులను తూర్పుచౌటపాలెంలోని తన మేనత్త సాయమ్మ (భర్త రాజశేఖర్‌రెడ్డి తల్లి) ఇంట్లోనే ఉండి చదువుకుంది. ఉదయం స్కూల్ బస్సు రాగానే తమ కుమారుడు జగన్ ఈ రోజు స్కూల్‌కు రాడని సరస్వతి బస్సు డ్రైవర్‌తో చెప్పినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది.


