ముంపు ప్రాంతాన్ని వదులుకునేది లేదు | A deepening concerns for bhadrachalam | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాన్ని వదులుకునేది లేదు

Feb 10 2014 2:34 AM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం భద్రాచలం  ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఇంటిని ముట్టడించారు. సుమారు రెండు గంటలకు పైగా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.

మూడు రహదారులను దిగ్బంధించి వాహనాలను రానివ్వకుండా అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని, దీనిపై ఎమ్మెల్యే కుంజా సత్యవతి వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గేటుకు అడ్డంగా కూర్చొని ఇంట్లో నుంచి ఏ ఒక్కరనీ బయటకు రానివ్వలేదు. ఆ సమయంలో ఎమ్మెల్యే భర్త కుంజా ధర్మారావు కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడగా ఆందోళనకారులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వచ్చేంత వరకూ కదలబోమంటూ మండుటెండను సైతం లెక్క చేయకుండా అక్కడే కూర్చొన్నారు.

 ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు సున్నం వెంకటరమణ, ముర్ల రమేష్ మాట్లాడుతూ ఆదివాసీలను ముంచే తెలంగాణ రాష్ట్రం తమకు వద్దన్నారు. పోలవరం ప్రాజెక్టుపై పార్టీల వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. దీని కోసం ఆందోళన ఉధృతం చేస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం డివిజన్ బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు.  కాగా, పట్టణంలోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే సత్యవతి ఆందోళన విషయం తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చారు. పోలవరం ఎత్తు తగ్గించాలని తాను కూడా పోరాడుతున్నానని, ఇక ముందు కూడా ఉద్యమిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు మడివి నెహ్రూ, సోడె మురళి తదితరులు పాల్గొన్నారు.

  డివిజన్ విభజనకు కాంగ్రెస్సే కారణం...
 భద్రాచలం డివిజన్ విభజన జరుగడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసమే గిరిజనులను జలసమాధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. పోలవరం నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడింది సీపీఎం ఒక్కటేనని అన్నారు.  

 ఆదివాసీలను ముంచే తెలంగాణ వద్దు...
 పోలవరం ప్రాజెక్టు పేరుతో ఆదివాసీలను ముంచే తెలంగాణ రాష్ట్రం వద్దని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు గొంది వె ంకటేశ్వర్లు అన్నారు. శనివరం భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపైనే తప్ప ఆదివాసీలపై రాజకీయ పార్టీలకు ఏమాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

 డివిజన్ బంద్‌కు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు...
 ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో జేఏసీ చేపడుతున్న భద్రాచలం డివిజన్ బంద్‌కు వైఎస్‌ఆర్‌సీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని పార్టీ నియోజకవర్గ క న్వీనర్ డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. బంద్‌లో పార్టీ కేడర్ అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల పక్షాన తమ పార్టీ నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కడియం రామాచారి, మంత్రిప్రగడ నర్సింహారావు, గంటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement