సినిమా చూపిస్త మావా! | Sakshi
Sakshi News home page

సినిమా చూపిస్త మావా!

Published Thu, Jun 13 2019 8:55 AM

Mutiplex Theatres Showing Cinema By Attaching GST To Tickects - Sakshi

రోజువారీ సాధక బాధకాల నుంచి సగటు జీవికి ఊరటనిచ్చే ‘సినిమా’ ప్రస్తుతం ప్రియంగా మారింది. ప్రేక్షకులకు కార్పొరేట్‌ మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌లోకి వెళ్లక ముందే యాజమాన్యాలు సినిమా చూపిస్తున్నాయి. పెద్ద హీరో సినిమాకు టికెట్లతోపాటు కాంబో ప్యాక్, ఆర్డినరీ ప్యాక్‌ కొనుగోలు తప్పనిసరి చేస్తున్నాయి. అప్పటికే  చేతిచమురు వదిలించుకున్నప్పటికీ ఇంటర్వెల్‌లో అసలు సినిమా మొదలవుతోంది. కేవలం స్నాక్స్‌కే రూ.800 నుంచి రూ.1000 వెచ్చించాల్సి వస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 

సాక్షి, నెల్లూరు : పెద్ద హీరో సినిమా రిలీజ్‌ అయితే మాత్రం అభిమానుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలోనే అభిమాన హీరోల సినిమాల రిలీజ్‌ అవుతుండడంతో అక్కడికే వెళ్లి సినిమా చూడాల్సివస్తోంది. కేవలం పాప్‌ కార్న్, కూల్‌డ్రింక్‌ బాటిల్‌ చేతిలో పెట్టి రూ.600 వంతున వసూలు చేస్తున్నారు. థియేటర్‌లలో టికెట్‌ రూ.150 వంతున వసూలు చేస్తుండగా కాంబో పేరుతో స్నాక్స్‌ అంటూ మరో రూ.450 అదనంగా పెంచి టికెట్లు ఇస్తున్నారు.

ఎవరు చెప్పినా..
నెల్లూరు నగరంలో 3 మల్టీఫ్లెక్స్‌ థియేటర్లు ఉన్నాయి. అందులో ఒక్క మల్లీఫ్లెక్స్‌లో సగటున 6 స్కీన్లు ఉన్నాయి. ప్రతిచోటా స్నాక్స్‌ పేరుతో అడ్డుగోలు దోపిడీ చేస్తున్నారు. థియేటర్‌ వెలుపల కొనుగోలు చేసిన ఏ తినుబండారమూ లోనికి అనుమతించడం లేదు. థియేటర్‌ క్యాంటీన్‌లోనే  కొనుగోలు చేయాలి. ఆఫ్‌ లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.50, చిన్న పాప్‌కార్న్‌కు రూ.170, కోల్డ్‌ కాఫీ రూ.150, పిజ్జా, కోక్‌ రూ.200, స్వీట్స్‌ కేక్స్‌ రూ.80.. ఇలా 28 రకాల ఫుడ్‌ ఐటమ్స్‌ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ రూ.100 నుంచి రూ.300 పైనే నిర్ణయించి విక్రయాలు చేస్తున్నారు. ప్రతి స్నాక్స్‌పై జీఎస్టీ బాదుడు అదనంగా వసూలు చేస్తున్నారు.

పార్కింగ్‌ పేరుతో దోపిడీ
మల్టీఫ్లెక్స్‌లలో పార్కింగ్‌ పేరుతో దోపిడీ చేస్తున్నారు. పార్కింగ్‌ వసతి ఉన్న చోట్ల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రుసుము వసూలు చేయకూడదు. అయినా నిర్వాహకులు యథేచ్ఛగా వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మాల్స్‌లో ద్విచక్రవాహనానికి రూ.20, కారు అయితే రూ.40 వంతున నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తూ పక్కా దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

న్యాయస్థానం తీర్పుతోనైనా..
మల్టీఫ్లెక్స్‌ థియేటర్ల దోపిడీపై గతంలో వినియోగదారుల న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వినోదం కోసం వెళ్లి వినియోగదారుడు జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిరావడంపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌లో దోపిడీపై ఫోరానికి వెళ్లిన బాధితుడికి నష్టపరిహారం చెల్లించేలా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి ఏడాది కావస్తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఇకనైనా తూనికలు, కొలతల శాఖ అధికారులు న్యాయస్థానం తీర్పును అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాజకీయ ఒత్తిళ్లు.. నెలవారీ మామూళ్లు
మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలో దోపిడీపై తెలంగాణ రాష్ట్రంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ప్రతి థియేటర్‌ వద్ద స్నాక్స్‌ ఎమ్మార్పీ ధరల పట్టిక తెలుగులో రాసిన బోర్డు పెట్టాలని, నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలోకి అధికారులు వెళ్లే సాహసం చేయడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు దోపిడీకి గురవుతున్న వినియోగదారుడికి న్యాయం చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement