రిమ్స్‌ నెఫ్రాలజీ వైద్యుల నిర్లక్ష్యం

Neglect of rims nephrology doctors - Sakshi

కిడ్నీ బాధితురాలికి వైద్యం నిరాకరణ

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : రిమ్స్‌లో వైద్యాధికారుల నిరక్ష్యం రాజ్యమేలుతోంది. కిడ్నీ వ్యాధితో డయాలసిస్‌ కోసం వచ్చిన మహిళకు వైద్యం చేసేందుకు వీరు నిరాకరించారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని నిర్ద్రయగా చెప్పారు. ఆమెకు వైద్యం చేయాలని కలెక్టర్‌ ఆదేశించినా, రిమ్స్‌ డైరెక్టర్‌ ఫోన్‌ చేసినా చివరకు ఆమెకు వైద్యం అందలేదు. బాధితురాలు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి మండలం పొలవరం గ్రామానికి చెందిన కిడ్నీ రోగి సనపల కళావతి ఇటీవల విశాఖపట్నం కేజీహెచ్‌లో డయాలసిస్‌ చేయించుకున్నారు. అక్కడ వైద్యం చేయించుకునే స్తోమత లేక టెక్కలి ఏరియా ఆస్పత్రిలో చేరారు. అక్కడ డయాలసిస్‌కి నెఫ్రాలజీ ప్రత్యేకాధికారి లేనందున రిమ్స్‌కు తరలించారు. గురువారం అక్కడకు తీసుకెళ్లగా.. ఆమెకు నిరాశే ఎదురైంది.

డయాలసిస్‌ చేయడం కుదరదని తెగేసి చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారని, అక్కడ ఖర్చు భరించలేమని చెప్పినా సిబ్బంది కనికరం చూపలేదని బంధువులు వాపోయారు. అప్పటి నుంచి ఆమె రిమ్స్‌లో ఉన్నారు. సోమవారం ఈ విషయంపై కలెక్టర్‌ కె.ధనుంజయరెడ్డికి గ్రీవెన్సు సెల్‌లో కళావతి బంధువు ఫిర్యాదు చేశారు. అయన వెంటనే స్పందించి రిమ్స్‌ డైరెక్టర్‌కి ఫోన్‌ చేసి వైద్యం అందించాలని ఆదేశించారు. వాటిని కూడా పట్టించుకోలేదు. వైద్యం అందించలేమని తేల్చిచెప్పారు. దీంతో కళావతిని బంధువులు  సోమవారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకువెళ్లారు. కాగా, దీనిపై రిమ్స్‌ నెఫ్రాలజీ విభాగ వైద్యురాలు జ్యోస్న మాట్లాడుతూ.. రిమ్స్‌లో తగిన పరికరాలు లేవన్నారు. రిమ్స్‌ సూపరింటెండెంట్‌ సునీల్‌ నాయక్‌ మాట్లాడుతూ.. రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో, విశాఖకు రిఫర్‌ చేయాల్సి వచ్చిందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top