హ్యాపీ జర్నీ!

Happy journey! - Sakshi

ప్రమాదాలు లేని ప్రయాణానికి సూత్రాలు

సిఫార్సు చేసిన మలేసియా సంస్థ 

సాక్షి, హైదరాబాద్‌: దసరా సెలవులు వచ్చాయి. అంతా కుటుంబాలతో ప్రయాణాలకు సిద్ధమవుతారు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు చాలా మంది వ్యక్తిగత వాహనాలనే వాడుతుంటారు. ఇలాంటి సుదూర ప్రయాణాలు సాఫీగా సాగడానికి ముందు జాగ్రత్తలు అవసరం. వీటిపై ‘మలేసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ సేఫ్టీ రీసెర్చ్‌’ఓ సమగ్ర అధ్యయనం చేసింది. ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది.సేఫ్‌ అండ్‌ హ్యాపీ జర్నీకి ప్రాథమిక సూత్రాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... 

ప్రయాణానికి బయలుదేరే ముందు... 
- వాహనానికి సర్వీసింగ్‌ ఎప్పుడు అయింది? మళ్లీ ఎప్పుడు చేయించాలి? అనేవి సరిచూసుకోవాలి.
- ప్రయాణించాల్సిన మార్గాన్ని ముందే నిర్దేశించుకోవడంతో పాటు అవసరమైన స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి.
- ప్రయాణించే/ డ్రైవింగ్‌ చేసే వాహనానికి అనువైన, పూర్తి సురక్షితమైన మార్గాన్నే ఎంచుకోవాలి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ వాహన సామర్థ్యానికి మించి ప్రయాణించకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
- వాహనంలో అవసరమైనంత ఖాళీ ఉండేలా... పిల్లల కోసం చైల్డ్‌సీట్స్‌/ బూస్టర్స్‌ తప్పనిసరి చేసుకుంటూ, సీట్‌బెల్ట్స్‌ను సరిచూసుకోవాలి. 

వాహనం టైర్లు
- బయలుదేరే ముందు వాహన టైర్ల స్థితి, అందులో గాలి తదితరాలను క్షుణ్ణంగా గమనించాలి. 
- టైర్లు సక్రమంగా లేకపోయినా, సామర్థ్యానికి మించి ఎక్కినా మార్గమధ్యంలో టైర్లు పాడవుతాయి. 
- పక్కాగా ఉన్న టైర్లు వాడితే సమయం, ఇంధనం ఆదా కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలూ తగ్గుతాయి. 

సుదూర ప్రయాణాలు చేసేప్పుడు... 
- రాత్రి 10 గంటలు, ఆ తర్వాత డ్రైవింగ్‌ చేస్తే ప్రమాదాలు జరిగే ఆస్కారం నాలుగు రెట్లు ఎక్కువ.
- ఆవలింతలు, ఏకాగ్రత లోపించడం, కళ్లు మండటం, బద్దకం, స్పందన వేగం తగ్గడం ఇవన్నీ అలసటకు నిదర్శనాలని గుర్తించాలి.
- ప్రతి రెండు గంటల డ్రైవింగ్‌  తర్వాత కాస్త విరామం తీసుకోవడం ఉత్తమం. ∙వీలుంటే డ్రైవింగ్‌  బాధ్యతల్ని లైసెన్స్‌ కలిగిన మరో డ్రైవర్‌కు అప్పగించడం లేదా కాసేపు ఆగడం చేయాలి.
- 20 నిమిషాలు రెస్ట్‌ తీసుకుంటే చాలు.. అలసట పోయి శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి.
- డ్రైవింగ్‌  చేసేప్పుడు మద్యంతో పాటు పొగ తాగడం, పొగాకు ఉత్పత్తుల్ని వినియోగించడం చేయకూడదు.
- కాఫీ వంటివి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ వీటినీ తీసుకోకపోవడమే మంచిది.
- మంచినీళ్లు తాగడంతో పాటు పండ్లు వంటి బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. 

విజన్‌... 
- రహదారిపై ఉన్న వస్తువులు, వ్యక్తులకు సంబంధించిన 90 శాతం సమాచారం డ్రైవింగ్‌  కళ్లే అతడికి అందిస్తాయి.
- ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు ఆకర్షణీయంగా ఉండే దుస్తులు ధరించాలి.
- ప్రయాణం ప్రారంభించే ముందే వైపర్, హెడ్‌లైట్ల పనితీరు పరీక్షించుకోవాలి.
- వాహనచోదకులు... ప్రధానంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఉదయం పూట హెడ్‌లైట్లు వినియోగించడం ఉత్తమం. 

మొబైల్‌ ఫోన్‌...
- డ్రైవింగ్‌  చేస్తూ మొబైల్‌ ఫోన్‌ వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం నాలుగు రెట్లు పెరిగినట్లే. 
- ఇయర్‌ఫోన్లు, బ్లూటూత్‌ వంటివి వినియోగించినా... సెల్‌ఫోన్‌ వినియోగం డ్రైవర్‌ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. 

సీట్‌ బెల్ట్‌... 
- ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహనం వెనుక భాగంలో కూర్చున్న వారికంటే డ్రైవర్, ఆ పక్క సీటులో కూర్చున్న వారికే ఐదు రెట్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారు కచ్చితంగా సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలి. ∙వాహనంలో ప్రయాణిస్తున్న వారు వాహన వేగంతో సమానంగా ముందుకు వెళ్తున్నట్లే. ఏదైనా అవాంతరం ఎదురై వాహనం హఠాత్తుగా ఆగితే... అదే వేగంతో అందులోని వారు డ్యాష్‌బోర్డ్‌/ స్టీరింగ్‌/ ముందు సీట్లకు ఢీకొని క్షతగాత్రులవుతారు. అలా కాకుండా సీట్‌బెల్ట్‌ కాపాడుతుంది. 

వేగం... 
- మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనచోదకుడికి తనకు ఎదురయ్యే ముప్పును తక్షణం గుర్తించడం, వాహనాన్ని ఆపడం సకాలంలో సాధ్యం కాదు.
- పరిమితికి మించి 10 శాతం వేగంతో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగితే సాధారణ స్థితికంటే 21 శాతం అధికంగా గాయాలవుతాయి. 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే తీవ్రమైన గాయాలు, కొన్ని సందర్భాల్లో మృత్యువుకూ ఆస్కారం ఉంది. 46 శాతం అధిక వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైతే మరణించడానికే అవకాశాలు ఎక్కువ. 

వెనుక నుంచి వచ్చే వాహనాలతో... 
- కొందరు కార్ల వెనుక అద్దం సమీపంలో సామానులు ఉంచుతారు. దీనివల్ల వెనుక వచ్చే వాహనం కనిపించక ప్రమాదాలు జరగొచ్చు.
- ప్రతి రెండు వాహనాల మధ్యా కనీసం 2 సెకన్లు ప్రయాణించే దూరం ఉండాలి. వెనుక వాహనం స్పీడు గంటకు 60 కిమీ ఉంటే... ముందు వాహనానికి కనీసం 33 మీటర్ల దూరంలో ఉండాలి.  
- టోల్‌గేట్లు, ట్రాఫిక్‌ జామ్‌ అయినప్పుడు క్యూ జంపింగ్‌ చేయకూడదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top