
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చిన మృతదేహాలు.. మార్చరీకి తరలింపు
సాక్షి, రాజమహేంద్రవరం : బోటు ప్రమాదం జరిగి 41వ రోజు మంగళవారం మరో ఏడు మృతదేహాలను గోదావరి నది నుంచి బయటకు తీశారు. కచ్చులూరు సంఘటన స్థలం నుంచి ఈ మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి రాత్రి 8.45 గంటల సమయంలో రెండు అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. పోలీసుల సమక్షంలో వాటిని మార్చరీలో భద్రపరిచారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మృతుల కుటుంబ సభ్యులు గుర్తించిన తరువాత మృతదేహాలను వారికి అప్పగిస్తారు. మృతదేహాలు బోటులోని ఒక రూమ్‌లో ఉండిపోవడంతో కుళ్లిపోయాయి.
బోటు అడుగు భాగాల్లో గాలింపు
రంపచోడవరం: కచ్చులూరు మందం వద్ద బోటును వెలికితీసిన తరువాత ఏడు మృతదేహాలు లభ్యమైనట్లు ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్ తెలిపారు. మృతదేహాలను ఎస్‌డీఆర్‌ఎఫ్, మెడికల్ బృందాలు బయటకు తీసుకువచ్చి పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇంకా లభించాల్సిన మృతదేహాలు కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారని తెలిపారు.