66 హెక్టార్లలోనే నష్టమంట!

66 Hectares Of Crops Destroyed In vizianagaram - Sakshi

పెథాయ్‌... జిల్లాలో ఈ తుఫాన్‌ రైతాంగం నడ్డివిరిచింది. పంట కోతకోసి పొలాల్లోనే కుప్పలుండగా భారీ వర్షాలు కురిశాయి. ఎంతగా రక్షించుకుందామన్నా... కిందనుంచి నీరు చేరింది. చివరకు జిల్లాలో 74వేల హెక్టార్లకు పైబడి పంట కుప్పల్లోకి నీరుచేరినట్టు ప్రాథమికంగా నిర్థారణైంది. కానీ ఇంతలో ఏమైందో ఏమో... దానిని పరిగణనలోకి తీసుకోలేదు. పైగా 74వేల హెక్టార్లలో నష్టపోయిన ఇతర పంటల్ని 66వేలకు కుదించేశారు. దీనివల్ల ఎవరు నష్టపోవాలో ఏమో..

విజయనగరం ఫోర్ట్‌: కష్టాల్లో ఉన్న రైతులను అన్ని విధిలా ఆదుకుంటామని చెప్పే పాలకులు చేతల్లో దానిని ఆచరించడం లేదు. రైతుకు అందించే సాయం విషయంలోనే ఎంతో కొంత కోత విధించే యోచనతో ప్రస్తుత సర్కారున్నట్టు అర్థమవుతోంది. పె«థాయ్‌ తుఫాన్‌వల్ల జరిగిన పంట నష్టం అంచనా విషయంలో ఈ ఆరోపణలు రుజువవుతున్నాయి. పంట నష్టం జరిగినదానికీ, అధికారులు లెక్కల్లో చూపుతున్నదానికీ ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీనిని బట్టి రైతులపై ఈ సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టమవుతోంది. జిల్లాలో కొద్ది రోజుల క్రితం సంభవించిన పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా జిల్లాలో వివిధ పం టలకు పెద్ద సంఖ్యలో నష్టం వాటిల్లింది. అయితే పంట ప్రాధమిక అంచనాలో అధికారులు గుర్తించి న నష్టం విస్తీర్ణం తుది నివేదిక సమయానికి తగ్గి పోవడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఇంతలో ఎంత వ్యత్యాసం
తుఫాన్‌ సమయంలో మొక్కజొన్న 520 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. తాజా తుది నివేదికలో 64 హెక్టార్లలో మాత్రమే మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. చెరుకు పంట 12 హెక్టార్ల వరకు నష్టం జరిగినట్టు ప్రాధమికంగా అంచనా వేసి, తుది నివేదికలో 1.4 హెక్టార్లుగానే పేర్కొన్నారు. 

పరిగణనలో లేని వరి పంట నష్టం
వేలాది హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. కోతకోసం పొలాల్లోనే కుప్పలు వేయగా వాటికిందకు భారీగా నీరు చేరింది. దీనివల్ల ధాన్యం రంగు మారడమే గాకుండా... కొంతవరకూ కుప్పలు కుళ్లి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కా నీ దానిని అధికారులు పరిగణనలోకి తీసుకోలే దు. తుఫాన్‌ కారణంగా జిల్లాలో పనలపై ఉన్న వరి పంట 14,788 హెక్టార్లలో నీట మునిగింది. కుప్పల రూపంలో 59,150 హెక్టార్లలో నీటమునిగింది. పంట నీటమునగడం వల్ల ధాన్యం రంగు మారి నష్టపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కానీ వరి పంటకు సంబంధించి పంట నష్టం జరిగినట్టు పరిగణనలోకి తీసుకోలేదు. వరి పంటకు నష్టం వాటిల్లినప్పటికీ రైతులకు పరిహారం అందే అవకాశం లేదు.

రూ. కోట్టలో నష్టం జరిగితే రూ. లక్షల్లో పరిహారం 
పెథాయ్‌ తుఫాన్‌ వల్ల వరి పంటకు 74,438 హెక్టార్లులో నష్టం వాటిల్లింది. దీని విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. మొక్కజొన్నకు 520 హెక్టార్లలో నష్టం వాటిల్లగా, దాని విలువ రూ.65 లక్షల వరకు ఉంటుంది. చెరుకు పంట 12 హెక్టార్లలో నష్టం వాటిల్లగా, దాని విలువ రూ. 2లక్షలు వరకు ఉంటుంది. కాని పరిహారం కోసం వ్యవసాయ అధికారులు మొక్కజొన్న, చెరుకు పంటలకు సంబంధించి 66.3 హెక్టార్లలో నష్టం జరిగినట్టు గుర్తించారు. దీనికి రూ.8.18 లక్షలు మాత్రమే పరిహారానికి వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

కోసిన పంట పరిగణనలోకి రాదు
వరి పంట కోసిన తర్వాత పంట నష్టం అంచనాలోకి పరిగణలోనికి తీసుకోం. రంగు మారి న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సిఫార్సు చేస్తాం.
– జి.ఎస్‌.ఎన్‌.లీలావతి, వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ 

వ్యవసాయ అధికారులు గుర్తించిన పంట నష్టం వివరాలు (హెక్టార్లలో) 
మండలం               పంట          నష్టం 
గుర్ల                  మొక్కజొన్న     1.4
పూసపాటిరేగ      మొక్కజొన్న     48 
చీపురుపల్లి        మొక్కజొన్న     15.5
చీపురుపల్లి        చెరకు    1.4 
వర్షపు నీటిలో    వరి చేను 
కుప్పలు(ఫైల్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top