ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ సర్టిఫికెట్ల పరిశీలనకు మొదటి రోజు 5,742 మంది విద్యార్థులు హాజరయినట్లు ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ రఘునాథ్ తెలిపారు.
హైదరాబాద్: ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ సర్టిఫికెట్ల పరిశీలనకు మొదటి రోజు 5,742 మంది విద్యార్థులు హాజరయినట్లు ఎంసెట్ (అడ్మిషన్స్) క్యాంప్ ఆఫీసర్ రఘునాథ్ తెలిపారు. ఏయూ పరిధిలో 1624 మంది, ఏస్వీయూ పరిధిలో 272 మంది, ఓయూ పరిధిలో 3,846 మంది హాజరైనట్లు ఆయన వివరించారు. 56 హెల్ప్‌లైన్ కేంద్రాలలో 37 కేంద్రాలు మాత్రమే పనిచేశాయి. 19 కేంద్రాల్లో కౌన్సెలింగ్ జరగలేదని రఘునాథ్ చెప్పారు.
సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల సీమాంధ్రలో ఎంసెట్ కౌన్సెలింగ్ సరిగా జరగలేదు. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపు ఎక్కడా కౌన్సెలింగ్ సజావుగా సాగలేదు. పాలిటెక్నిక్ అధ్యాపకుల సంఘం ఇప్పటికే సమ్మె చేస్తుండటంతో వారంతా కౌన్సెలింగ్ విధులను బహిష్కరించారు. మరికొన్ని చోట్ల ఇతర సిబ్బంది కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి ప్రయత్నించినా జేఏసీ నాయకులు, విద్యార్థులు అడ్డుకోవడంతో ఏమాత్రం ముందుకు సాగలేదు. అందువల్లనే సీమాంధ్రలో తక్కువ మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలించగలిగారు.